
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 2024–2025 సంవత్సరానికి రూ.2,151 కోట్లకు పైగా నిధులను నిలిపేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జాతీయ విద్యా విధానం 2020ని డీఎంకే ప్రభుత్వం అమలుచేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వ శిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. జాతీయ విద్యా విధానం అమలుతోనే నిధులు వస్తాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
సర్వశిక్ష అభియాన్ నిధులను జాతీయ విద్యావిధానాన్ని అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదని పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ పెట్టిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం కేంద్ర నిధులపై పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.