హామీని నిలబెట్టుకున్న విజయ్‌.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం | Tamil Nadu CM TVK Vijay Delhi Tour | Sakshi
Sakshi News home page

హామీని నిలబెట్టుకున్న విజయ్‌.. వచ్చే వారం ఢిల్లీకి సీఎం

May 23 2026 8:43 AM | Updated on May 23 2026 11:41 AM

Tamil Nadu CM TVK Vijay Delhi Tour

సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, ప్రభుత్వానికి, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తనకు సలహాలు అందించేందుకు ఇద్దరు ప్రత్యేక సలహాదారులను నియమించారు. వీరిలో ఒకరు ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త జాన్‌ ఆరోగ్యస్వామి ఉన్నారు. సీఎం విజయ్‌ తన రాజకీయ సలహాదారుగా ఆయన్ను నియమించుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం గెలుపు వ్యూహాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. 

ప్రముఖ సలహాదారు విష్ణు రెడ్డిని ఇతర ప్రభుత్వ, పాలనాపరమైన విషయాల కోసం సలహాదారుడిగా నియమించుకున్నారు. కాగా, జ్యోతిష్కుడు, టీవీకే అధికార ప్రతినిధి రతన్‌ పండిట్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమించగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు నిపుణులను అధికారికంగా రంగంలోకి దిగారు.

వచ్చే వారం ఢిల్లీకి సీఎం విజయ్‌
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌ మొదటిసారిగా వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. క్యాబినెట్‌ విస్తరణ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్‌ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధులు, మేఘాదాతు ఆనకట్ట వివాదంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కూడా విజయ్‌ కలవనున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ. 65 లక్షల ఆర్థిక సహాయంతో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన తిరువళ్లువర్‌’ విగ్రహాన్ని సీఎం విజయ్‌ ఆవిష్కరించనున్నారు. అలాగే జూన్‌ 11న ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశానికి కూడా ఆయన హాజరుకానున్నారు.

సీఎంఓ ప్రత్యేక ఈ–మెయిల్‌ ఐడీలు విడుదల
ముఖ్యమంత్రి విజయ్‌ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజల వినతిపత్రాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సచివాలయానికి రాకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించేందుకు అధికారిక ఈ–మెయిల్‌ ఐడీలను ప్రభుత్వం విడుదల చేసింది.

హామీని నిలబెట్టుకున్నసీఎం విజయ్‌
చెప్పింది చేస్తాడు.. చేసింది చెబుతాడు’ అనే నినాదంతో సీఎం విజయ్‌ పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులు ప్రస్తుతం తమిళనాడులో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. విక్రవాండిలో జరిగిన టీవీకే మొదటి రాజకీయ మహానాడులో తాము అధికారంలోకి వస్తే మిత్రపక్షాలకు పరిపాలనలో భాగస్వామ్యం (సంకీర్ణ ప్రభుత్వం) కల్పిస్తామని విజయ్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట ఇచ్చినట్లుగానే, తాజాగా వీసీకే నాయకుడు వన్నియరసు, ఐయూఎంఎల్‌ నాయకుడు షాజహాన్‌లను క్యాబినెట్‌ మంత్రులుగా చేర్చుకుని, తమిళనాడు రాజకీయాల్లో ఒకే పార్టీ సర్వాధికారాల సంస్కృతిని మార్చి, సరికొత్త విప్లవాత్మక సంకీర్ణ యుగానికి విజయ్‌ తెరలేపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ పోస్టు వైరల్‌గా మారింది.

620 అమ్మ క్యాంటీన్ల’ పునరుద్ధరణకు ఆదేశం
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు గతంలో ప్రారంభించబడిన అమ్మ క్యాంటీన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్‌ పరిధిలోని 383 అమ్మ క్యాంటీన్లు,ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 237 అమ్మ క్యాంటీన్లను అత్యుత్తమ వసతులతో పునర్నిర్మించి, పేదలకు నిరంతరాయంగా తక్కువ ధరకే ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement