
తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
చెన్నై: రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు జీవించి ఉన్న రాజకీయ నేతల పేర్లు పెట్టడం లేదా ప్రభుత్వ ప్రచార సామగ్రిలో మాజీ ముఖ్యమంత్రులు లేదా సైద్ధాంతిక నాయకుల ఫోటోలను ఉపయోగించవద్దని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రకటనల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలు, కంటెంట్ మార్గదర్శకాలను ఉదహరించింది.
ఇటీవలే, తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరును కలుపుకొని ‘ఉంగలుడన్ స్టాలిన్’, ‘స్టాలిన్ విత్ యు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అదే పేరుతో ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగం పిటిషన్ దాఖలు చేశారు. సంక్షేమ పథకాల్లో రాజకీయ ప్రముఖులను పొందుపరచి రాష్ట్రం ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులను, ప్రభుత్వ ప్రకటన మార్గదర్శకాలు–2014ను ఉల్లంఘించిందని వాదించారు. ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఆపడం లేదని, ఈ తీర్పు వాటిని ఎలా ప్రచారం చేస్తున్నారనే దానిపైనేనని హైకోర్టు స్పష్టత ఇచ్చింది.