
ఆయుష్షు మీద వ్యక్తిత్వ లక్షణాల ప్రభావం
సాయపడే మనస్తత్వం, బాధ్యతగా ఉండటమూ..
మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకోవడమూ..
సమయపాలన, చురుకుదనంతో దీర్ఘాయువు
అసంతృప్తి, ఆందోళనలతో అల్పాయుష్షు
మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు మంచివారు అనిపించుకోవడమే కాదు.. దీర్ఘాయుష్మంతులు అని పిలిపించుకునే అదృష్టం కూడా దక్కుతుందట. చురుగ్గా ఉండటం, నలుగురికీ సాయపడే మనస్తత్వం, సమయపాలన, ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం, కష్టపడే వ్యక్తిత్వం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకునేవారు..
ఈ లక్షణాలు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం, అసంతృప్తిగా ఉండటం వల్ల జీవితకాలం తగ్గిపోతుందట.
ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవి..
మంచి పోషకాహారం, వ్యాయామాలే. ఇవే దీర్ఘాయుష్షుకు చిట్కాలు అనుకుంటాం. కానీ, కొన్ని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయని, మరణ భయాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరపకురా చెడేవు.
మంచి లక్షణాలతో..
సాధారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటి ఆధారంగా వ్యాధులు లేదా రోగాలను అంచనా వేస్తారు. వ్యక్తుల ఆలోచనల తీరు, అనుభూతి చెందుతున్న విధానం, వారి ప్రవ ర్తన వంటివి.. భవిష్యత్తులో రాబోయే రోగా లు లేదా వ్యాధులను అంచనా వేయడానికి వైద్యులు సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని ప్రముఖ మనస్తత్వవేత్త రెనే మోటస్ తెలిపారు. మనుషులు తమ వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ కాలం బతికేందుకు అవకా శం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తు న్నాయని ఆయన అన్నారు. ఈ నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలకు, మరణానికి సంబంధం ఉందని వెల్లడించారు. ‘ఆందోళన, నిరాశ, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను తరచుగా, తీవ్రంగా అనుభవించే ధోరణిని కలిగి ఉండడ మే న్యూరోటిసిజం. ఈ లక్షణాలను మార్చడం కష్టం. దీనికంటే వ్యక్తిత్వ లక్షణాలు మార్చడం సులభం. తద్వారా న్యూరోటిసిజం కూడా నయమవుతుంది’ అని ఆయన అన్నారు.
అవి వద్దు.. ఇవి ముద్దు
ఆందోళనకర మానసిక స్థితి, ప్రశాంతత లేనివారి ఆయుష్షు రోజురోజుకీ క్షీణి స్తుంటుంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు, ధూమపానం చేసేవా రికి సైతం ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితో పోలిస్తే మనస్సాక్షి ని నమ్మి, దానికి అనుగుణంగా పనిచేసేవారిలో.. మెరుగైన ఆరోగ్య నిర్వహణ, అధిక స్వీయ–క్రమశిక్షణ, బాధ్యత, ఉల్లాసభరితమైన జీవితం వంటి ఆరోగ్యకర మైన అలవాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. విశాల దృక్పథం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, ఎప్పుడూ ఉల్లాసంగా, చురుగ్గా ఉండటం వంటి లక్షణాలు జీవితకాలాన్ని పెంచుతాయని పేర్కొంది.
వ్యక్తిత్వమూ కీలకమే
‘ఆయుష్షు విషయంలో వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనలో తేలింది. కానీ వైద్యరంగం, ప్రపంచం.. ఆరోగ్యం విషయంలో దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని ఐర్లాండ్‌లోని లిమెరిక్ విశ్వవిద్యాలయంలో మన స్తత్వశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, నివేదిక సహ రచయిత పారిక్ ఓ సూలివా¯Œ వ్యాఖ్యానించారు. ‘సమయపాలన పాటించేవారు, ఏ పనినైనా పద్ధతిగా చేసేవారు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. సమయాన్ని అనవసర విషయాలకు వ్యర్థం చేయడం వీరికి నచ్చదు. అందువల్ల ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ వీరు మిగతావారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు మిగతావారికంటే ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని అన్నారు.
28 ఏళ్లపాటు అధ్యయనం
⇒ పరిశోధనలో 22,000 మంది పాలుపంచుకున్నారు. 6 నుంచి 28 ఏళ్లపాటు వీరిపై అధ్యయనం చేశారు. వ్యక్తిత్వ లక్షణాలను మరణానికి అనుసంధానించిన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించి వీరి మరణ కాలాలను అంచనా వేశారు.
⇒ మనస్సాక్షికి విలువ ఇచ్చి, అందుకు అనుగుణమైన విశి ష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు.. ఈ లక్షణాలు లేనివారి తో పోలిస్తే వేగంగా చనిపోయే అవకాశాలు 15శాతం తక్కువ.
⇒ సమయపాలన పాటిస్తూ, ఏ పనినైనా ఒక పద్ధతిగా చేసే లక్షణాలున్న వారు.. తొందరగా మరణించే అవకాశం 14 శాతం తక్కువ.
⇒ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులూ ఎక్కువ కాలం బతుకుతారు. బాధ్యతారాహిత్యంతో ఉండేవారితో పోలిస్తే వీరు వేగంగా మరణించే అవకాశాలు 12 శాతం తక్కువ.
⇒ కష్టపడి పనిచేసే మనస్తత్వం లేదా లక్షణాలు ఉన్నవారిలో మరణ అవకాశాలు 15 శాతం తక్కువ.