
కన్నడ అగ్రనటుడు దర్శన్ తూగుదీప బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయాధికారం దుర్వినియోగమైందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దర్శన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నాలుగు నెలలపాటు జైలులో గడిపాడు నటుడు దర్శన్. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌తో ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. అయితే.. దర్శన్‌తో సహా మరో ఏడుగురి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్, ఫోటోలు, రేణుకాస్వామిపై జరిగిన హింసకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ, బెయిల్ రద్దు అవసరం ఉందని లూథ్రా వాదించారు. ఇది అత్యంత క్రూరమైన హత్యగా పేర్కొంటూ, రేణుకాస్వామి శరీరంపై గాయాలు, అంగవైకల్యం, రక్తస్రావం వంటి అంశాలను వివరించారు. ఇక దర్శన్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అయితే.. జులై 17నాటి విచారణ సందర్భంగా జస్టిస్ పార్థీవాలా దర్శన్ తరఫు లాయర్ కపిల్ సిబాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘హైకోర్టు తీర్పు చదివితే, వాళ్లు నిందితులను ఎలా విడుదల చేయాలో చూస్తున్నట్టు ఉంది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నారో వివరించాంలి’’ అని సిబాల్‌ను కోరారు. దానికి కపిల్ సిబాల్ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, సాక్షుల స్టేట్మెంట్లను పరిశీలించాలంటూ కోరారు.
ఈ తరుణంలో ఇవాళ్టి విచారణ సందర్భంగానూ సుప్రీం కోర్టు దర్శన్ బెయిల్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది న్యాయ అధికార వికృత వినియోగం అని వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలిపిన బెంచ్.. పదిరోజుల్లో తీర్పు ఏంటన్నది వెల్లడిస్తామంది.
కేసు ఏంటంటే..
రేణుకాస్వామి అనే అభిమాని, దర్శన్ ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఆపై వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చారు.
2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. ఒకవేళ సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు అయితే, దర్శన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
కేసు టైంలైన్
2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు.
2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.