సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్‌ | Supreme Court reverses own order, grants boy custody to mother | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఉత్తర్వు రివర్స్‌

Jul 18 2025 6:10 AM | Updated on Jul 18 2025 6:10 AM

Supreme Court reverses own order, grants boy custody to mother

13 ఏళ్ల కుమారుడిని తండ్రికి అప్పగిస్తూ గతేడాది తీర్పు  

తల్లి కస్టడీకే అప్పగిస్తూ మళ్తీ ఉత్తర్వు జారీ  

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణ యం తీసుకుంది. ఏడాది క్రితం తాము స్వయంగా ఇచ్చిన ఉత్తర్వునే మార్చేసింది. 13 ఏళ్ల బాలుడి మానసిక పరిస్థితిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అతడిని తల్లికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ బాలుడిని తండ్రి కస్టడీకి అప్పగిస్తూ 2024 ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వును న్యాయస్థానం మార్చింది. 

కేరళకు చెందిన యువతి, యువకుడికి 2011లో వివాహం జరిగింది. వారికి 2012లో కుమారుడు జన్మించాడు. తర్వాత కాపురంలో విభేదాలు తలెత్తడంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుమారుడు తల్లి వద్దే ఉండేలా, తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా ఒప్పందం కుదిరింది. 2015లో వారికి విడాకులు మంజూరయ్యాయి. యువతి మళ్లీ పెళ్లిచేసుకుంది. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. 

మొ దటి భర్త నాలుగేళ్లుగా ఆమె మొదటి కుమారుడిని చూడడానికి రాలేదు. తాను మలే షియా వెళ్లిపోతున్నానని, మొదటి బిడ్డను కూడా తీసుకెళ్తానని, ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని మొదటి భర్తను 2019 లో కోరింది. అందుకు అతడు నిరాకరించా డు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. కానీ, బిడ్డను తల్లికే అప్పగిస్తూ 2022లో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. 

దీన్ని సవాలు చేస్తూ మొదటి భర్త కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. హైకోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బిడ్డను తండ్రి కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గత ఏడాది విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును సమరి్థంచింది. కుమారుడు తండ్రి వద్దే ఉండొచ్చని ఉత్తర్వు జారీ చేసింది.

 దాంతో ఈ ఉత్వర్వును పునఃసమీక్షించాలని కోరుతూ తల్లి మరోసారి పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వును రివర్స్‌ చేస్తున్నట్లు తేల్చిచెప్పింది. కుమారుడు తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చిచెప్పింది. ఈ సమయంలో అతడికి తల్లి అవసరం చాలా ఉందని అభిప్రాయపడింది. చిన్న వయసులో బిడ్డకు తల్లే అసలైన సంరక్షురాలు అని న్యాయస్థానం పేర్కొంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement