
న్యూఢిల్లీ: డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీకి(Senthil Balaji) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) చుక్కెదురైంది. క్యాష్ ఫర్ లాండ్ కుంభకోణం కేసు పెండింగ్‌లో ఉన్నందున తనను తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంలో గత ఉత్తర్వుపై స్పష్టత ఇవ్వాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.
మంత్రి పదవి(DMK Minister Post) గురించిన ప్రస్తావన ఆ ఉత్తర్వుల్లో లేనే లేదని స్పష్టం చేసింది. ‘మేం ఆ ఉత్తర్వును మళ్లీ చదవం. మీరు మంత్రిగా(Tamil Nadu) మారడానికి దానిని మేం చదవలేం. అయితే, మీరు మంత్రి పదవిని చేపట్టినా లేదా మరే ఇతర అధికార పదవిని నిర్వహించినా రాష్ట్ర వాతావరణం ప్రభావితమైతే, న్యాయం జరిగేలా అప్పుడే చూస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది.
మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీని పదవికి రాజీనామా చేయాలంటూ ఇచ్చిన తీర్పుపై మళ్లీ స్పష్టత కోరడమెందుకంటూ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌ను ప్రశ్నించింది. బెయిల్ వచ్చిన కొన్ని రోజుల్లోనే తిరిగి మంత్రి పదవిని చేపట్టిన సెంథిల్ బాలాజీ, కేసుల విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నందునే జైలుకు వెళ్లడం మంచిదంటూ అప్పటి ధర్మాసనం వ్యాఖ్యానించి ఉంటుందని పేర్కొంది.