
ఓటరు ఐడీ, ఆధార్‌ను పరిగణనలోకి తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై ఇప్పటికిప్పుడు మధ్యంతర స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఓటరు జాబితా సవరణకు ఆధార్‌తోపాటు ఓటరు గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ధ్రువీకరణలను వాస్తవమై నవిగా భావిస్తున్నామంది. ‘రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వీటిని తేలిగ్గా ఫోర్జరీ చేయొచ్చు. కానీ, ఆధార్, ఓటర్ కార్డులను వాస్తవమైనవిగా భావించొచ్చు.
ఈ రెండు ధ్రువీకరణలను అనుమతించండి’అని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 29వ తేదీన చేపడతామని తెలిపింది. పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ అనే ఎన్‌జీవో తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడే మధ్యంతర జాబితాను ఖరారు చేయవద్దని, ఆగస్ట్ ఒకటో తేదీన ఈసీ ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించకుండా మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, దీనివల్ల మొత్తం ఎస్‌ఐఆర్ ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొన్న ధర్మాసనం ఆయన వాదనను తోసిపుచ్చింది.
‘న్యాయస్థానం అధికారాన్ని తక్కువగా చూడకండి. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకమని తేలిన పక్షంలో మీ వాదనను అంగీకరిస్తాం. అప్పుడే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఆసాంతంగా రద్దు చేసేస్తాం’అని ధర్మాసనం కరాఖండిగా చెప్పింది. బిహార్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌కు ఆధార్‌తోపాటు ఓటరు ఐడీని అంగీకరించాలంటూ ఈసీని ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. ఈ మేరకు ప్రాథమికంగా అంగీకరిస్తూ ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సోమవారం ధర్మాసనం పరిశీలించి, పై వ్యాఖ్యలు చేసింది.
ఆధార్, ఓటరు కార్డును అంగీకరిస్తూ ఈసీ అఫిడవిట్ వేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఈ సందర్భంగా లాయర్ శంకరనారాయణన్ తెలపగా.. ఎస్‌ఐఆర్ కోసం అంగీకరిస్తున్న 11 ధ్రువీకరణలతోపాటు ఆధార్, ఓటరు ఐడీ కూడా ఉంటాయని జస్టిస్ సూర్య కాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈసీ తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది..ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అదేవిధంగా, ఓటరు ఐడీని ఓటరు సవరణ ప్రక్రియలో నమ్మకమైందిగా భావించలేమన్నారు. ఓటరు ఐడీని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం ప్రక్రియతో ఎటువంటి లాభం ఉండదని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం.. ‘ఈ ప్రపంచంలో ఏ ధ్రువీకరణ పత్రాన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. ఫోర్జరీ కేసుల విషయాన్ని ఈసీ చూసుకోవాలి. అన్ని పేర్లను తొలగించడానికి బదులుగా అందరినీ జాబితాలో చేర్చేలా చూడాలి.