
ఖరారు చేసిన అత్యున్నత న్యాయస్థానం
కార్యదర్శి పోస్టు మహిళా లాయర్లకే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌సీబీఏ) ఎన్నికల తేదీని అత్యున్నత న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ నెల 20వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల్లో అసోసియేషన్ కార్యదర్శి పోస్టును మహిళా లాయర్లకు ప్రత్యేకంగా రిజర్వు చేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా, ఎగ్జిక్యూటివ్ కమిటీలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకే ఇవ్వాలని కూడా తెలిపింది. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల దర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టతనిచి్చంది.
2024 ఓటరు జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని, ఫిబ్రవరి 28వ తేదీతో అర్హత పొందిన లాయర్ల పేర్లను కూడా 2025 ఎస్‌సీబీఏ ఓటరు జాబితాలో చేర్చాలని తెలిపింది. మే 21వ తేదీన ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటించాలని ధర్మాసనం పేర్కొంది. ఎస్‌సీబీఏ ఎన్నికల్లో సంస్కరణలను సూచించేందుకు నియమించిన సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు ఇచి్చన నివేదికను ఎస్‌సీబీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం తెలిపింది. ఈ నివేదికపై తగు సూచనలు ఇవ్వడమే తప్ప, ఎవరూ సవాల్ చేయరాదని స్పష్టం చేసింది. మే 19వ తేదీతో ఎస్‌సీబీఏ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ గడువు ముగుస్తున్నందున కమిటీ సిఫారసులను ఈ పోలింగ్‌కు అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది.