Mohammed Zubair: జుబేర్‌కు అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Supreme Court Granted Interim Bail To Mohammed Zubair All Cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ట్వీట్‍తో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్‌ మహమ్మద్ జుబేర్‍కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్నీ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జుబేర్‍ను రూ.20వేల పూచీకత్తుతో సాయంత్రం 6గంటల్లోగా కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.  అంతేకాదు అతనిపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌కు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్తగా నమోదయ్యే కేసులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. 2018లో ఓ మతానికి వ్యతిరేకంగా జుబేర్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్‌యే దర్యాప్తు చేస్తోంది. 

విచారణ సందర్భంగా జుబేర్ అరెస్టుకు సంబంధించి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జుబైర్‌ను తరచూ కస్టడీకి తీసుకెళ్లడానికి సరైన కారణమేమి కన్పించడం లేదని చెప్పింది. పోలీసులు అరెస్టు చేసే అధికారాన్ని మితంగా ఉపయోగించుకోవాలని హితవు పలికింది.

అలాగే జుబేర్‍ను ట్వీట్‌ చేయకుండా నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జర్నలిస్టును రాయొద్దని చెప్పడమంటే.. న్యాయవాదిని వాదించవద్దనడంతో సమానమని అభిప్రాయపడింది. ఆయన చేసే ట్వీట్‌లకు బాధ్యత కూడా ఆయనదే అని స్పష్టం చేసింది. వాటికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 

2018 ట్వీట్‌కు సంబంధించి జుబేర్‍పై మొదట ఢిల్లీలో కేసు నమోదైంది. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో యూపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని జుబేర్‍ సుప్రీంను ఆశ్రయించారు. వాటన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. కేసులను కొట్టి వేసే విషయంపై ఢిల్లీ హైకోర్టునే సంప్రదించాలని సూచించింది.
చదవండి: పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసు నిందితుడు హతం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top