ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన | Sudden deaths Raised In India Centre says no links with COVID vaccines | Sakshi
Sakshi News home page

దేశంలో ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన

Jul 2 2025 12:31 PM | Updated on Jul 2 2025 3:27 PM

Sudden deaths Raised In India Centre says no links with COVID vaccines

గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్‌-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

వ్యాక్సిన్‌ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్‌ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. 

ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. 

  • జన్యుపరమైన లోపాలు

  • జీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)

  • కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలు

  • ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది
     

టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల ‍వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. 

 

 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. 

ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం..  2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. 

ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి.  ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement