
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్‌లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్‌లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్‌తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.
దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్‌ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది.
ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల