
స్థానిక బ్రాండ్స్ నుంచే నిజాయితీగా సమాచారం
మహిళలు నడిపే వ్యాపారాలకు యూత్ మద్దతు
సహజ పదార్థాలతో తయారైన వాటివైపే మొగ్గు
ఆఫ్‌లైన్ షాపింగ్‌కు దక్షిణ భారత కస్టమర్ల ఆసక్తి
ఒక్కో ప్రాంతం, తరం, స్త్రీ, పురుషులను బట్టి కొనుగోలు తీరుతెన్నులు మారుతున్నాయి. మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్‌కు ఉత్తర భారతంలో ఆదరణ ఎక్కువ. దక్షిణాది కస్టమర్లు సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు ఆఫ్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నారు.
భారతీయ వినియోగదారుల కొనుగోలు తీరును, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి.. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగోవ్’ సహకారంతో 18 రాష్ట్రాల్లోని 5,000 మంది వినియోగదారులతో వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘రుకమ్ క్యాపిటల్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రాంతం బట్టి ప్రాధాన్యతలు
పశ్చిమ భారతం: స్వదేశీ బ్రాండ్స్ అంటే మక్కువ. పండుగ సమయంలో కార్డ్ ఆధారిత చెల్లింపులు అధికం. ఏఐ/వర్చువల్ ట్రై–ఆన్ ్స ప్రయత్నించడం అంటే విపరీతమైన ఆసక్తి. సంస్కృతి, స్థానిక ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు.
తూర్పు భారతం: పర్యావరణ అనుకూల, మన్నికగల ఉత్పత్తులకు మొగ్గు చూపుతారు. కూపన్ ్స, సేల్ డేస్, బహుమతులను కోరుకునే కస్టమర్లు. సాంస్కృతిక విలువలు, ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను ఇష్టపడతారు.
ఉత్తర భారతం: మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్‌కు ఆదరణ ఎక్కువ. కంపెనీలతో భావోద్వేగ బంధం ఉంది.. ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికం. ప్రకటనలను ఇట్టే గ్రహిస్తారు.
దక్షిణ భారతం: సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తులపట్ల వ్యామోహంతోనే కొనుగోళ్లు అధికం. సెలబ్రిటీలు చేశారు కదా అని ఆ ప్రకటనల ఆధారంగా కొనుగోళ్లు చేయడం తక్కువ. అత్యధిక శాతం మంది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
» ఆరోగ్యం, సంరక్షణ విభాగంలో పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను అందించే బ్రాండ్స్‌నే ఇష్టపడతామని 100% మంది చెప్పడం విశేషం. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకే ప్రాధాన్యత అని 76% మంది స్పష్టం చేశారు.
» 50% కంటే ఎక్కువ మంది.. పండుగల సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని భావిస్తున్నారు. 40% మంది చక్కెర రహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు.
» ప్రథమ శ్రేణి నగరాల్లోని వినియోగదారుల్లో 57% మంది ఆరోగ్యకరమైన స్నాక్స్, 41% మంది చక్కెర రహిత స్వీట్లను ఎంచుకున్నారు. తృతీయ శ్రేణి నగరవాసుల్లో 65% మంది సంప్రదాయ స్వీట్లను తింటామని తెలిపారు.
మహిళలను ప్రోత్సహించేలా..
» 58% మంది స్థానిక/స్వదేశీ బ్రాండ్స్‌ను ఇష్టపడుతున్నారు.
» కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత ఉండే, అధిక వ్యయం చేసే కంపెనీల ఉత్పత్తులు కొనేందుకు 56% మంది ఆసక్తి చూపారు.
» కొత్త స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు చాలామంది ముందుకు వచ్చారు. వారి నుంచి ఉత్పత్తులు కొనేందుకు తాము సిద్ధమని 43% మంది వెల్లడించారు.
» మహిళలు నడిపే వ్యాపారాల నుంచి మాత్రమే షాపింగ్ చేస్తామని 68% మంది మిలీనియల్స్, జెన్–జీ తరం వాళ్లు చెప్పడం విశేషం.
» 14% మంది 20–30% అధిక ధర చెల్లించడానికి సిద్ధం.
» పండుగ షాపింగ్ విషయానికి వస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో స్వదేశీ బ్రాండ్స్ వైపు 61% మొగ్గు చూపుతున్నారు.
» స్థానిక బ్రాండ్లు రోజువారీ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందిస్తున్నాయి. నిజాయితీగా ఈ కంపెనీలిచ్చే ప్రామాణిక సమాచారాన్ని అభినందిస్తున్నట్లు 76% మంది తెలిపారు.
» ఇతర దేశాల్లో లేదా సంస్కృతిలో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను విక్రయించే బ్రాండ్స్ నుంచి కొనుగోలు చేసినట్టు 59% మంది చెప్పారు.
వీటి ఆధారంగా.. బ్రాండ్ ఎంపిక, కొనుగోలును ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..
48% ఈ–కామర్స్ పోర్టల్స్‌లో సేల్ డేస్
47% ఫెస్టివ్ సేల్ / ఎండ్ ఆఫ్ సీజన్ సేల్
47% ఆఫర్లు, డిస్కౌంట్లకు గూగు ల్/ఆన్ లైన్ లో సెర్చ్
42% బ్రాండ్ వెబ్‌సైట్లలో ఆఫర్లు
అందుకే కొనడంలేదు
బ్రాండ్ ఉత్పాదన కొనుగోలుకు నిరోధకాలు
కాలక్రమేణా ఉత్పత్తి నాణ్యత మారుతోంది 29%
తక్కువ ధరకు ఇలాంటి ఉత్పత్తి దొరికింది 28%
కస్టమర్ కేర్ నుంచి కరువైన ప్రతిస్పందన 26%
షిప్పింగ్ ఆలస్యం / అధిక చార్జీలు 25%
ఈ బ్రాండ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావు 25%