
తిరువనంతపురం: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విచారం వ్యక్తం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది చాలా విషాదకర పరిస్థితి. మన దేశంలో జనసమూహ నిర్వహణలో ఏదో లోపం ఉంది. ప్రతి ఏటా ఇలాంటి ఏదో ఒక ఘటన జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇదే సమయంలో బెంగళూరు ఘటన గుర్తుకువస్తోంది. ఈ తొక్కిసలాటల్లో పిల్లలు కూడా చనిపోతున్నారని విన్నప్పుడు హృదయం ద్రవించిపోతోంది’ అని థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళనాడులోని కరూర్‌లో నటుడు, రాజకీయ నేత విజయ్ సారధ్యంలో జరిగిన ర్యాలీలో భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి, 40 మంది మృత్యువాపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మొదలుకొని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎంపీ శశి థరూర్ ‘భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, భారీ సమావేశాల విషయంలో కఠినమైన నియమాలను, భద్రతా ప్రోటోకాల్‌లను రూపొందించాలి. సాధారణ ప్రజానీకాన్ని రక్షించేందుకు జాతీయ స్థాయిలో క్రమబద్ధమైన విధాన రూపకల్పనకు ఏమి చేయగలం అని ఆలోచించాలి.
జనం అటు సినిమా నటుడైనా, ఇటు రాజకీయ నేత అయినా వారి మాటలు వినడానికి ఉత్సాహంగా బహిరంగ సభలకు హాజరవుతుంటారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని నియమాలు, ప్రమాణాలు, ప్రోటోకాల్‌లు అమలులో ఉండాలి. అదే సమయంలో తొక్కిసలాటలో అయినవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. ఏదిఏమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసమూహాన్ని నియంత్రించేందుకు కఠినమైన విధానాలను తీసుకురావాలి. ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని కోరుతున్నానని శశిధరూర్ పేర్కొన్నారు.
తమిళనాడులోని కరూర్‌లో తమిళగా వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 40 మంది మృతిచెందారు. 70 మంది గాయపడ్డారు.ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. రెండు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు విజయ్ కూడా బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.