సాక్షి చెన్నై:తమిళనాట పొలిటికల్ హీట్ వేడెక్కింది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలన్నీ గెలుపుకోసం ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ స్టార్ విజయ్ స్థాపించిన విజయ్ తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పొత్తులపై ఆపార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.
టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ "సెక్యులరిజం భావజాలంలో కాంగ్రెస్, టీవీకే సహజంగానే మిత్రులు, మతతత్వానికి రెండు పార్టీలు వ్యతిరేకులు, ఆ విషయాలలో రెండు పార్టీలు సహజంగానే భాగస్వామ్యులు అంతేకాకుండా రాహుల్ గాంధీ, విజయ్ ఇద్దరు మంచి మిత్రులు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్, టీవీకే రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయి". అని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల అక్కడి కాంగ్రెస్ నేతలు పొత్తుకు అంగీకరించకపోవచ్చు అని తెలిపారు.
ఒకవేళ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేఖ ఓట్లను చీల్చకుండా ఒకే పార్టీ పొందవచ్చు అన్నారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుల గురించి మాట్లాడడం ఇప్పుడు సరైన పద్ధతి కాదని అన్నారు. అయితే కాంగ్రెస్-టీవీకే మధ్య ఇది వరకే మంచి సయోధ్య కుదిరిందని గతేడాది డిసెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హజరయ్యారని ఆయన తెలిపారు.
అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్యా ఈ పొత్తు దాదాపు అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రధాన భాగస్వామి అంతేకాకుండా రాహుల్ గాంధీకి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.
తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చాలా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ ఫాలోయింగ్‌ని క్యాచ్ చేయడానికి 2024లో తమిళిగ వెట్రి కజగం (టీవీకే) అనే పార్టీని స్థాపించారు. స్టార్‌డమ్‌కు అనుగుణంగానే లక్షల మందితో సభలు నిర్వహించి అందరిదృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందారు. ఈ తొక్కిసలాట ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.


