ఒకటి కాదు.. రెండు శక్తిమంతమైన తుపాన్లు భూమిని ఢీకొట్టనున్నాయి! సముద్రాల అల్పపీడనాలతో పుట్టినవి కాదులెండి.. మన సహజ నక్షత్రం సూర్యుడిపై పేలుళ్ల ఫలితమిది. మనకేమైనా ముప్పా? ప్రాణాలకొచ్చిన భయమేమీ లేదు కానీ.. ఆస్తుల విషయం మాత్రం అంత గ్యారంటీగా చెప్పలేము!
విషయం ఏమిటంటే... సూర్యుడిపై రెండు భారీ పేలుళ్లు లాంటివి సంభవించాయి. ఫలితంగా అక్కడ సలసల కాగుతున్న పదార్థం కాస్తా ఉవ్వెత్తున ఎగసిపడింది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు వీటిని. కిలోమీటర్ల ఎత్తుకు ఎగసే ఈ పదార్థం అక్కడి కణాలకు విద్యుదావేశాన్ని అందిస్తుంది. ఈ కణాలు కాస్తా లక్షల కిలోమీటర్లు దాటుకుని ఆదివారం భూ వాతావరణాన్ని చేరనున్నాయి. భూమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తే మాత్రం.. కక్ష్యల్లో తిరుగుతున్న ఉపగ్రహ వ్యవస్థలు, భూమ్మీద ఉన్న విద్యుత్తు గ్రిడ్లకు సమస్యలొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సౌర తుపానుల వల్ల నష్టం కచ్చితంగా జరుగుతుందా? అంటే స్పష్టమైన సమాధానం మాత్రం లేదు.
సూర్యుడి నుంచి వెలువడ్డ పదార్థంతో భూ అయస్కాంత క్షేత్రం ఎలా ప్రభావితమవుతుందన్న అంశంపైనే మొత్తం ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆదివారం భూమిని తాకనున్న భూఅయస్కాంత తుపాను జీ2 స్థాయిది అని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) తెలిపింది. భూకంపాల మాదిరిగా సౌర తుపానులను కొలిచే ఈ లెక్కలో జీ1 నుంచి జీ5 వరకూ స్థాయిలున్నాయి. దీన్నిబట్టే ఈ తుపానులు భూమిపై చూపే ప్రభావం ఉంటుంది. జీ2 స్థాయి తుపాను వల్ల కొన్ని ఉపగ్రహాలకు ఇబ్బంది ఏర్పడవచ్చు. అలాగే రేడియో కమ్యూనికేషన్స్, జీపీఎస్ వంటి నావిగేషన్ వ్యవస్థలపైనా ప్రభావం చూపవచ్చు.
రకరకాల తుపానులు
సౌర తుపానులు కరోనల్ మాస్ ఎజెక్షన్స్‌తోపాటు ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. సూర్యుడిపై అయస్కాంత క్షేత్రంలో మార్పులు, సన్ స్పాట్స్ (అయస్కాంత క్షేత్రం బలంగా ఉన్న చిన్న చిన్న మచ్చల్లాంటి ప్రాంతాలు), సూర్యుడి నుంచి విడుదలయ్యే విపరీతమైన శక్తులు కూడా సౌర తుపానులు కారణాలవుతూంటాయి. కరోనల్ మాస్ ఎజెక్షన్ దిశ భూమివైపు ఉన్నప్పుడు వచ్చే సౌర తుపాను కక్ష్యల్లోని ఉపగ్రహాలపై ప్రభావం చూపుతూంటుంది. రేడియో ధార్మిక పదార్థంతో వచ్చే సౌర తుపానులను ఎస్1 – ఎస్5 అని వర్గీకరిస్తే, రేడియో తరంగాలను పూర్తిగా అడ్డుకునే సౌర తుపానులను ఆర్1– ఆర్5లుగా వర్గీకరించారు.
నోవా అంచనాల ప్రకారం అక్టోబరు 7, 8వ తేదీల్లో సూర్యుడి సమీపం నుంచి రెండు విద్యుదావేశిత సౌర తుపానులు వెలువడ్డాయి. మొదటిదానితో పోలిస్తే రెండోది వేగంగా కదులుతోంది. భూమిని చేరేలోపు రెండూ కలసిపోతాయని అంచనా. భూమిపై వీటి ప్రభావం ఓ మోస్తరుగా ఉండవచ్చునని నోవా చెబుతోంది. భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకేటప్పుడు మాత్రమే అందులోని పదార్థాల ధర్మాల ఆధారంగా తీవ్రతను నిర్ణయించగలమని నోవా చెబుతోంది. జీ2 స్థాయి సౌర తుపాను ప్రభావం అధిక అక్షాంశాల ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుందని అంచనా.
అంటే... ధ్రువ ప్రాంతాల్లో వోల్టేజీలో తేడాలు నమోదు కావచ్చు. ఉపగ్రహాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రేడియో సంకేతాలు బలహీనపడతాయి. ఉపగ్రహ నావిగేషన్ కచ్చితత్వంలోనూ తేడాలొస్తాయి. అదే సమయంలో ధృవ ప్రాంతాల్లో ఆకాశం రంగులతో మెరిసిపోవడాన్ని (అరోరా బోరియాలిస్) కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశంపై మాత్రం ఆదివారం నాటి సౌర తుపానుల ప్రభావం దాదాపుగా శూన్యం!
– నేషనల్ డెస్క్, సాక్షి


