పప్పు బాగోలేదని.. శివసేన ఎమ్మెల్యే వీరంగం | Shiv Sena MLA Gaikwad Thrashes Canteen Contractor | Sakshi
Sakshi News home page

పప్పు బాగోలేదని.. శివసేన ఎమ్మెల్యే వీరంగం

Jul 9 2025 11:49 AM | Updated on Jul 9 2025 12:10 PM

Shiv Sena MLA Gaikwad Thrashes Canteen Contractor

ముంబై: శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ క్యాంటీన్‌ నిర్వాహకునిపై తన ప్రతాపం చూపారు. ఈ ఘటన ముంబైలోని ఆకాశవాణి గెస్ట్‌ హౌస్‌లో చోటుచేసుకుంది. క్యాంటీన్‌లో తనకు వడ్డించిన ఆహారంలో పప్పు బాగోలేదని, అది తిన్న కొద్దిసేపటికే తనకు అనారోగ్యంగా అనిపించిందని సంజయ్ గైక్వాడ్ చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో సమస్యను లేవనెత్తుతానని ఆయన అన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుల్దానా నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన గైక్వాడ్, శాసనసభ్యుల కోసం ప్రభుత్వం కేటాయించిన వసతి గృహం అయిన ఆకాశవాణి ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. శివసేనలోని ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న క్యాంటీన్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు సమాచారం. వైరల్‌ అయిన వీడియోలో గైక్వాడ్ షర్టు, టవల్‌ ధరించి క్యాంటీన్ నిర్వాహకునితో గొడవపడుతున్న దృశ్యం కనిపిస్తుంది.
 

కొన్ని సెకన్ల తర్వాత ఆ ఎమ్మెల్యే క్యాంటీన్‌ నిర్వహకునికి ముఖంపై ఒక పిడిగుద్దు కొడతారు. దీంతో అతను కింద పడిపోతాడు. తరువాత అతను లేవగానే మళ్లీ అతని చెంపమీద ఎమ్మెల్యే కొడుతూ నా స్టైల్‌ ఇదే అంటూ వ్యాఖ్యానించడం వినిపిస్తుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతానని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అనడం వినిపిస్తుంది. క్యాంటీన్‌లో ఆహార నాణ్యతపై తాను రెండుసార్లు ఫిర్యాదు చేశానని గైక్వాడ్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక తెగ్గోసేవారికి రూ. 11 లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement