
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్‌పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్‌పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్‌కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్‌పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్‌కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
#MumbaiRain #AirIndia
Landing at Mumbai airport midst of heavy rain ,
Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025
ముంబైకి ఆరెంజ్ అలర్ట్..
ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.