ఆన్‌లైన్‌ సంపాదన, చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉందా.. మీ కోసమే ‘సీకో’ యాప్‌ | Short Learning App Seekho Gains Popularity Among Youth For Quick Skills And Online Earning Tips | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ సంపాదన, చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉందా.. మీ కోసమే ‘సీకో’ యాప్‌

May 27 2026 1:56 PM | Updated on May 27 2026 3:47 PM

Seekho App Revolutionizes Learning for Digital Natives

చదువుకోవాలంటే గంటల తరబడి క్లాసులు వినాల్సిన రోజులు మారిపోతున్నాయి. ఇప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాల చిన్న వీడియోలతోనే కొత్త నైపుణ్యాలు నేర్పిస్తున్న యాప్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ సంపాదన, చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉన్నవారిలో “సీకో” (Seekho) అనే యాప్‌ వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.

బెంగళూరుకు చెందిన కీరో ఎడుటెక్‌(Keyaro Edutech సంస్థ రూపొందించిన ఈ యాప్‌.. తక్కువ సమయంలో ఉపయోగపడే విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. యూట్యూబ్‌ ఛానల్‌ను ఎలా అభివృద్ధి చేయాలి? సోషల్‌ మీడియాలో వీడియోలు ఎలా వైరల్‌ చేయాలి? చిన్న మొత్తాలతో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మార్గాలేమిటి? వంటి అంశాలను చిన్న చిన్న వీడియోల రూపంలో అందిస్తోంది.

అంతేకాదు.. పాన్‌ కార్డు, ముద్ర రుణాలు వంటి ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసే విధానాలను కూడా ఇందులో వివరిస్తున్నారు. దీంతో చదువు మాత్రమే కాదు.. రోజువారీ జీవితంలో ఉపయోగపడే సమాచారం కూడా ఒకేచోట దొరుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు.

“సబ్‌స్క్రైబర్లు తగ్గిపోకుండా ఎలా చూసుకోవాలి?”, “కృత్రిమ మేధతో చిత్రాలు, కోట్స్‌ తయారు చేసి ఎలా సంపాదించాలి?”, “పాత చెప్పుల అమ్మకాల ద్వారా ఆదాయం ఎలా పొందాలి?” వంటి కోర్సులు యువతలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోర్సులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని సంస్థ చెబుతోంది.

ఈ యాప్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే… నేర్చుకునేవారే తర్వాత బోధించేవారిగా మారే అవకాశం ఉండటం. తమకు తెలిసిన విషయాలను వీడియోల రూపంలో ఇతరులతో పంచుకుని ఆదాయం పొందే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తోంది. అందుకే చాలామంది దీన్ని కేవలం చదువు చెప్పే యాప్‌గా కాకుండా, “సంపాదనకు దారి చూపే వేదిక”గా చూస్తున్నారు.

ప్రస్తుతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువత కూడా ఇలాంటి డిజిటల్‌ వేదికల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలో ఉపయోగపడే విషయాలు నేర్చుకోవాలనుకునే కొత్త తరానికి “సీకో”లాంటి యాప్‌లు భవిష్యత్తులో మరింత ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement