Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్‌ | Security Guard Arrested In Kolkata Law College Incident | Sakshi
Sakshi News home page

Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్‌

Jun 28 2025 5:03 PM | Updated on Jun 28 2025 5:09 PM

Security Guard Arrested In Kolkata Law College Incident

కోల్‌కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ లా ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్‌ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. ‌

కోల్‌కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్‌ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్‌కు వచ్చింది. 

విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్‌ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్‌ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.

సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్‌ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్‌ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.

మా కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న జయీబ్‌ అహ్మద్‌ (19), ప్రమీద్‌ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్‌ బెదిరించాడు.

నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్‌ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్‌ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement