సాయం చేయాలని ఉంది.. కానీ: సుప్రీంకోర్టు | SC Says Want To Help But Where To Draw Line On Women Officers Plea | Sakshi
Sakshi News home page

మహిళా అధికారుల పిటిషన్‌ కొట్టివేత

Sep 3 2020 3:22 PM | Updated on Sep 3 2020 3:28 PM

SC Says Want To Help But Where To Draw Line On Women Officers Plea - Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీలో శాశ్వత కమిషన్‌(పీసీ) కింద లభించే ప్రయోజనాలు తాము కూడా పొందేందుకు వీలుగా కటాఫ్‌ తేదీని మార్చాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) మహిళా అధికారులకు నిరాశే మిగిలింది. ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేయని వాళ్లకు పీసీ ప్రయోజనాలు కల్పించాలంటే గతంలో తాము ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సి వస్తుందని, అదే జరిగితే అన్ని బ్యాచ్‌లు ఇలాంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎస్‌ఎస్‌సీ కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా... 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఎస్‌ఎస్‌సీ అధికారులు పీసీ కింద పరిగణింపబడతారని, అదే విధంగా అంతకంటే ఎక్కువ కాలం ఎస్‌ఎస్‌సీలో కొనసాగిన వారికి మొత్తంగా 20 ఏళ్ల పాటు సర్వీసులో ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు కంటే ఒక నెల తక్కువ సర్వీసు ఉన్న 19 మంది మహిళా అధికారులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు.(చదవండి: ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్‌)

తద్వారా పదవీ విరమణ అనంతరం పీసీ కింద లభించే ప్రయోజనాలు(పెన్షన్‌) పొందే వీలు ఉంటుందని వారి తరఫు న్యాయవాది మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకు స్పందించిన జస్టిస్‌ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘తీర్పు వెలువడే నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందని, పీసీ కింద చేకూరే ప్రయోజనాలు చేకూరుతాయని ఆనాటి జడ్జిమెంట్‌లో పేర్కొన్నాం. తీర్పు చెప్పిన రోజే కటాఫ్‌ డేట్‌. ఒకవేళ మేం ఆ తేదీని మారిస్తే.. తర్వాతి బ్యాచ్‌లకు కూడా ఇలాగే మార్చాల్సి వస్తుంది. ముందు బ్యాచ్‌లపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంది. కానీ అదెలాగో అర్థం కావడం లేదు’’అని పిటిషనర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. (చదవండి: టీనేజర్‌కు బెయిల్‌ నిరాకరించిన సుప్రీం )

ఇక ఈ పిటిషన్‌ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది, కల్నల్‌ బాలసుబ్రహ్మణ్యం మహిళా అధికారుల అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘‘జూలై 16 న శాశ్వత కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఫిబ్రవరి 17 నాటికి 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లకు మాత్రమే పెన్సన్‌ వస్తుంది. ఒకవేళ మీరు దీనిని అనుమతిస్తే.. సంక్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకంటే ప్రతీ ఆర్నెళ్లకొకసారి ఓ బ్యాచ్‌ బయటకు వస్తుంది. వాళ్లందరికీ ఇలాంటి ప్రయోజనాలు కల్పించలేము’’అని కోర్టుకు తెలిపారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు ఆర్మీలో శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆర్మీ, ఎయిర్‌, డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌ వంటి విభాగాల్లో పని చేసేందుకు శాశ్వత కమిషన్‌ కింద నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. దీంతో మహిళలంతా పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు సర్వీసులు కొనసాగే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement