పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. టీఎంసీలో భారీ చీలిక, తన గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై సువేందు సర్కార్ దర్యాప్తు, మరోవైపు మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీబీఐ విచారణతో ఆమె రాజకీయంగా ఒత్తిడిలో ఉన్నారు. దీనికి తోడు ఇన్నాళ్లు వెన్నంటే ఉన్న సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్న పరిస్థితి కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే దీదీతో రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న శతాబ్ది రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని మరింత కుదిపేస్తున్నాయి.
ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత.. మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని.. పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
“దీదీ ఇంతకు ముందులా లేనేలేరు’’ అంటూ టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్.. 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె.

“దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా.. నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు..
.. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం(తిరుగుబాటు) తీసుకున్నాను” అని శతాబ్ధిరాయ్ తెలిపారు. అలాగే.. పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్ ఉంది. అందుకే బయటకు వచ్చేశా.. అని అన్నారామె.

శతాబ్ది రాయ్(56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బీర్బూమ్ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు లోక్‌సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తృణమూల్ కాంగ్రెస్‌లోని అటు చీలిక ఎమ్మెల్యేల వర్గం తిరుగుబాటుకు కారణమైంది. ఆ వెంటనే ఇటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు ఇటీవల పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ పరిణామాల మధ్య దాదాపు డజను మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతలతో సమావేశమై ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ రెబల్ వర్గం సంఖ్య 20కి చేరిందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.


