
ధరాలీలో 28 మందితో కూడిన కేరళ పర్యాటక బృందం జాడ గల్లంతు
బురదలో కూరుకుపోయిన వారి జాడ కోసం తీవ్రస్థాయిలో అన్వేషణ
ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్): ఎగువ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం) కారణంగా ఖీర్‌గంగా నదీ ప్రవాహం ఉప్పొంగి దిగువన ధరాలీ గ్రామా న్ని బురద ముంచెత్తడంతో అందులో కూరుకు పోయిన వారి జాడ కోసం యుద్ధప్రాతిపదికన గా లింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలో ఇప్పటికే ఐదుగురు సజీవ సమాధికాగా మరొకరి మృతదేహాన్ని బుధవారం వెలికితీశారు. గ్రామంలో చిక్కుకుపోయిన 190 మందిని కాపాడారు.
ఇంకా 100 మందికిపైగా జాడ గల్లతైంది. దీంతో ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పోలీసు, సహాయక బృందాలు సహాయక, అన్వేషణ చర్యల్లో పూర్తిగా మునిగిపోయాయి. హార్సిల్‌లోని ఆర్మీ క్యాంప్‌కు చెందిన 11 మంది జవాన్ల జాడ ఇంకా తెలియరాలేదు. గంగోత్రి ధామాన్ని దర్శించుకునేందుకు కేరళ నుంచి వచ్చిన 28 మంది యాత్రికుల బృందం జాడ గల్లంతైంది. దీంతో ఆ బృందసభ్యుల బంధువుల్లో ఆందోళనలు రెట్టింపయ్యాయి.
‘‘ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి మంగళవారం ఉదయం 8.30 గంటలకు బయల్దేరినట్లు నాతో ఫోన్‌లో చెప్పారు. వాళ్లు ప్రయాణిస్తున్న మార్గంలోనే కొండచరియలు పడ్డాయి. తర్వాత వాళ్లకు ఫోన్ చేస్తే అస్సలు కలవడంలేదు’’ అని ఒక బంధువు ఏడుస్తూ చెప్పారు. ‘‘ధరాలీలో మాకు ఇల్లు, హోటల్ ఉన్నాయి. అక్కడే నా సోదరుడు, భార్య, కుమారుడు ఉంటారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంతవరకు నా సోదరుడు, అతని కుటుంబం జాడ తెలీడంలేదు’’ అని మరో వ్యక్తి వాపోయాడు.
బురదలో కూరుకుపోయిన ప్రాచీన ఆలయం
మంగళవారంనాటి బురదచరియలు దూసుకొచ్చిన ఘటనలో ధరాలీ గ్రామంలోని ప్రాచీన కల్ప్ కేదార్ శివాలయాన్ని బురద పూర్తిగా కప్పేసింది. ఈ ఆలయాన్ని సైతం కేదార్‌నాథ్ ఆలయం మాదిరే ‘కథూర్’ శైలిలో నిర్మించారు. దశాబ్దాల క్రితం జరిగిన ఇలాంటి ఘటనలోనూ కల్ప్‌కేదార్ ఆలయం చాలాభాగం మట్టిలో కూరుకుపోయింది.
ఇన్నాళ్లూ శివాలయం పైభాగం మాత్రమే బయటకు కనిపించేది. దీంతో చిన్నపాటి మార్గం గుండా లోపలికి వెళ్లి భక్తులు దర్శనాలు చేసుకునే వాళ్లు. ఆలయ గర్భగుడిలో శివలింగంపై ఖీర్‌గంగా నదీజలం అభిషేకంచేస్తున్నట్లు పడేలా గతంలో ఏర్పాట్లుచేశారు. మంగళవారం నాటి ఉత్పాతంతో పూర్తిగా బురదలో కలిసిపోయింది. ఈ ఆలయాన్ని 1945లో తవ్వకాల్లో గుర్తించారు.
పలు చోట్ల విరిగిపడిన కొండచరియలు..
కొండచరియలు పడడంతో గంగోత్రి జాతీయ రహదారిపై పలు చోట్ల రాకపోకలు స్తంభించిపోయాయి. గంగోత్రి జాతీయరహదారి వెంట లిమిఛా నదిపై గంగ్నానీ వద్ద నిర్మించిన వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ వైపు నుంచి వస్తున్న సహాయక బృందాలు ముందుకు కదల్లేక అక్కడే ఆగిపోయాయి. కొండచరియలు పడిన ప్రతిచోటా ఇదే పరిస్థితి. దీనికి తోడు భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కల్గిస్తున్నాయి.
వర్షం తగ్గాక ఆకాశమార్గంలో గాలింపు కోసం ఆర్మీ ఎంఐ–17, ఛినూక్ హెలికాప్టర్లను సిద్ధం చేసింది. ‘‘ ధరాలీ గ్రామంలో సగభాగం సమాధిలా మారింది. ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, చెట్లు మొత్తం బురదలో కూరుకుపోయాయి. బాధితులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలను 160 మంది పోలీసులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. బుధవారం ఆయన ఘటనాస్థలిని సందర్శించారు.