భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యూనస్ సర్కార్ కవ్వింపు చర్యలకు దిగింది. బంగ్లాదేశ్ గంగా నది నీటితో పద్మా బ్యారేజీ నిర్మాణానికి సిద్ధం కావడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 1996లో జరిగిన ఫరక్కా జలాల ఒప్పందం 2026లోనే ముగిసిపోనుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫరక్కా నీటి ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు సాగుతాయా? అనే సందిగ్థత నెలకొంది. మరోవైపు.. పద్మా బ్యారెజీ నిర్మాణానికి చైనా ఫండింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒప్పందం ఇలా..
భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే గంగా నది భాగాన్నే అక్కడ పద్మా నది అంటారు. అయితే, గంగా నది నీటి వాటాల విషయంలో రెండు దేశాల మధ్య 1977లోనే మొదటి తాత్కాలిక ఒప్పందం ఢాకాలో జరిగింది. 1977లో అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఫరక్కా బ్యారేజీ సమస్యను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రస్తావించారు. ఇరు దేశాలూ కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది. 1977 నవంబర్‌లో అప్పటి భారత ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ బంగ్లాదేశ్‌లో సందర్శించి, ఫరక్కా సమస్యను పరిష్కరించడానికి ఒక ఒప్పందంపై చర్చించారు. 1980–1990 మధ్య కాలంలో పలు చర్చలు విఫలమయ్యాయి. దీంతో, బంగ్లాదేశ్ తరచుగా నీటి కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది. 1996లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఫరక్కా బ్యారేజీ వద్ద ఉపరితల జలాల పంపిణీ నిర్దారణకు గంగా నీటి ఒప్పందం కుదిరింది.
అనంతరం, ఫరక్కా జలాల ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. జనవరి 1 నుంచి మే 31 వరకు ఇరు దేశాలు ఫరక్కా వద్ద నది ప్రవాహాన్ని పంచుకుంటాయి. 30 ఏళ్ల కాలానికి సంతకం చేసిన ఈ ఒప్పందంపై ఇప్పుడు 2026లో మళ్లీ చర్చలు జరగాల్సి ఉంది. కాగా, ఫరక్కా బ్యారేజీ వద్ద నీటి విడుదల, నిల్వపై ఇరు దేశాలు తరచుగా విభేదిస్తున్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలకు పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ గేట్లు తెరవడమే కారణమని బంగ్లాదేశ్ ఆరోపించింది.

బంగ్లా వాదన ఇదే..
బంగ్లాదేశ్ ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందించి వాస్తవాలను గ్రహించాలని కోరింది. ఫరక్కా కేవలం ఒక బ్యారేజీ మాత్రమేనని, డ్యామ్ కాదని, నీటి మట్టం పెరిగినప్పుడు వచ్చే నీరంతా ప్రవహిస్తుందని భారత్ వివరించింది. గంగా/ పద్మా నదిపై గేట్లను ఉపయోగించి 40,000 క్యూసెక్కుల నీటిని ఫరక్కా కాలువలోకి మళ్లిస్తామని మిగిలింది బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుందని భారత్ తెలిపింది. అయితే, భారత్ నిర్మించిన ఫరక్కా బ్యారేజీ వల్ల గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, అందుకే పద్మా బ్యారేజీ అవసరం పెరిగిందని బంగ్లాదేశ్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు ఫరక్కా బ్యారేజీకి సుమారు 180 కిలోమీటర్ల దిగువన, కుష్టియా జిల్లాలోని పాంగ్షాలో నిర్మించే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ వాటర్ డెవలప్‌మెంట్ బోర్డు (BWDB) పత్రాల ప్రకారం, ఫరక్కా బ్యారేజీ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ నైరుతి ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ మరో బ్యారేజీ నిర్మాణానికి సిద్దమైంది. సుమారు రూ.50,443.64 కోట్ల ఠాకాలతో( భారత కరెన్సీలో ₹37,895 కోట్లు) పద్మా బ్యారేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. పద్మా బ్యారేజీ ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి, దేశంలోని నైరుతి, ఈశాన్య ప్రాంతాలకు ఏడాది పొడవునా జలాలను అందించవచ్చని బంగ్లాదేశ్ విశ్వసిస్తోంది. బంగ్లాదేశ్‌లోని దాదాపు 37% ప్రాంతాలకు ఈ బ్యారేజీ ప్రయోజనం చేకూరుస్తుందని, 1996 ఒప్పందం ప్రకారం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని బంగ్లాదేశ్ ప్లాన్ చేసుకుంటోంది.
చైనా ఫండింగ్..
ఇదిలా ఉండగా.. పద్మా బ్యారేజీ కోసం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చైనా సాయం తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ రుణాల కోసం తర్వాత దశలో బంగ్లాదేశ్ ప్రయత్నించే అవకాశం ఉంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో కలిసి తీస్తా మాస్టర్ ప్లాన్ అమలులో కూడా చైనా భాగస్వామిగా ఉంది. ఇటీవల చైనా రాయబారి యావో వెన్.. పశ్చిమ బెంగాల్‌లోని వ్యూహాత్మక సిలిగురి కారిడార్‌కు సమీపంలో ఉన్న ఉత్తర బంగ్లాదేశ్‌ను సందర్శించడం భారత్ నిశితంగా గమనిస్తోంది. సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే తీస్తా నది నీటి పంపిణీకి సంబంధించిన సుదీర్ఘ ఒప్పందాన్ని భారత్, బంగ్లాదేశ్‌లు ఇంకా ఖరారు చేయలేకపోయాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. తీస్తా నీటిని పంచుకుంటే, ఉత్తర బెంగాల్‌కు తాగునీరు కూడా అందదని, సాగునీటికి అవకాశం ఉండదని ఆమె అంటున్నారు.
పద్మా బ్యారేజ్ ప్రాజెక్ట్ ప్రభావాలు..
ప్రాజెక్ట్ వివరాలు:
స్థానం: కుష్టియా జిల్లా, బంగ్లాదేశ్.
ఖర్చు: సుమారు Tk 50,443.64 కోట్లు (₹37,895 కోట్లు).
పొడవు: 2,100 మీటర్లు.
నిల్వ సామర్థ్యం: 2,900 మిలియన్ క్యూబిక్ మీటర్లు.
విద్యుత్ ఉత్పత్తి: 113 MW.
బంగ్లాదేశ్‌కు లాభాలు:
ఎండాకాలంలో నీటి నిల్వ, వ్యవసాయానికి సరఫరా.
దక్షిణ–పశ్చిమ ప్రాంతాల్లో నీటి కొరత తగ్గింపు.
విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణలో స్వయం ఆధారం
భారత్ ఆందోళనలు:
గంగానది ప్రవాహం మరింత తగ్గే అవకాశం.
పశ్చిమ బెంగాల్, బీహార్‌లో నీటి అవసరాలు ప్రభావితం కావచ్చు.
ఫరక్కా ఒప్పందం పునరుద్ధరణ చర్చలు మరింత క్లిష్టం కావడం


