టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్‌ బాబోయ్‌ | Rebellion Storm Rocks TMC: What a Twist | Sakshi
Sakshi News home page

టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్‌ బాబోయ్‌

Jun 12 2026 11:35 AM | Updated on Jun 12 2026 11:48 AM

Rebellion Storm Rocks TMC: What a Twist

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించే పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఇప్పుడు పార్టీ చీలిక అంచుల దాకా వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన రెబల్స్‌ రాసిన సీక్రెట్‌ లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది. అంతేకాదు.. అసలైన తృణమూల్‌ కాంగ్రెస్‌ తమదేనని, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు తమకే ఉందని వారు వాదిస్తున్నట్లు సమాచారం.

ఏకంగా 19 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేసి, ప్రత్యేక పార్లమెంటరీ వర్గంగా గుర్తింపు ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. మే 18 తేదీతో స్పీకర్‌కు పంపిన ఆ రహస్య లేఖ.. కొన్ని మీడియా సంస్థల స్టింగ్‌ ఆపరేషన్‌ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో మెజారిటీ ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌, నటి-ఎంపీ రచనా బెనర్జీ, సయోనీ ఘోష్‌, శతాబ్ది రాయ్‌, కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ తదితరులు ఉన్నారు. ఈ పరిణామంతో.. తృణమూల్‌లో కేవలం తొమ్మిది మంది మాత్రమే మమతా శిబిరంలో మిగిలినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెబల్‌ ఎంపీలకు ఏ పార్టీనో, కూటమిలోనే చేరే ఉద్దేశం లేదని వాళ్ల లేఖను బట్టి అర్థమవుతోంది. స్వతంత్ర పార్లమెంటరీ గ్రూప్‌గా పనిచేస్తామని వాళ్లు స్పీకర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వారి తదుపరి వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్రం తీసుకునే నిర్ణయాలను కూడా ఈ వర్గం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనే కుతూహలం నెలకొంది.

ఇప్పటికే మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  అభిషేక్‌ బెనర్జీ వ్యవహార శైలిపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ అసంతృప్తే ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలోనూ మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, ఇప్పుడు ఎంపీలు కూడా వేరు దారి పట్టడం.. తృణమూల్‌ 28 ఏళ్ల చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా ఉంది. తిరుగుబాటు ఎంపీలు స్పీకర్‌కు లేఖ రాసిన తేదీ మే 18. అయితే పార్టీ చీఫ్‌ విప్‌గా సీనియర్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ నియామకం మే 19న జరిగింది. దీంతో సాంకేతికంగా ఈ వర్గానికి గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అన్నది స్పీకర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే.. పార్టీ గుర్తుపై కూడా రెబల్‌ వర్గం హక్కు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్దే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారని వాదిస్తూ వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశముంది. 

మరోవైపు నటుడు.. సీనియర్‌ ఎంపీ శతృఘ్న సిన్హా మాత్రం తిరుగుబాటు వర్గానికి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకే తన మద్దతు ప్రకటించారు. మహువా మెయిత్రా సైతం దీదీ పక్షాన నిలిచి అధికారిక శిబిరంలో కొనసాగుతున్నారు. 

ఇప్పటికే పార్టీపై పట్టు కోల్పోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న మమతకు.. రెబల్స్‌ తాజా ఎత్తుగడలు మైండ్‌ బ్లాక్‌ చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక వర్గం, పార్టీ గుర్తు, ఎన్నికల సంఘం పోరు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తున్న తిరుగుబాటు నేతలు దీదీ శిబిరంలో ఆందోళన పెంచుతున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే.. ఈ వివాదం ఎన్నికల సంఘం నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement