ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్‌ విషయాలు | Rahul Meena assaulted another woman hours before IRS officer daughters assault | Sakshi
Sakshi News home page

ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్‌ విషయాలు

Apr 23 2026 5:52 PM | Updated on Apr 23 2026 7:01 PM

Rahul Meena assaulted another woman hours before IRS officer daughters assault

ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తె, 22 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ మీనా ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొన్ని గంటల ముందే రాజస్థాన్‌లో మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల నివేదిక  ప్రకారం దక్షిణ  ఢిల్లీలో  కైలాష్ హిల్స్ అత్యాచారం,  హత్య  కేసులో ప్రధాన నిందితుడైన 23 ఏళ్ల రాహుల్ మీనా, రెండు రాష్ట్రాల్లో ఇలాంటి భయంకర నేరాల పరంపర వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

మొదట రాజస్థాన్‌లో, తర్వాత ఢిల్లీలో ఘాతుకం
మంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన పరిచయస్తుడి భార్యపై రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భర్త ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆ రాత్రి తనపై లైంగిక దాడి చేశాడని రాజస్థాన్‌ మహిళ అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ చౌదరికి ఫిర్యాదు చేసింది. మరోవైపు నిందితుడు, బాధిత మహిళ భర్తకు మధ్య జూదం కార్యకలాపాల ద్వారా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత రాత్రికి రాత్రే క్యాబ్ మాట్లాడుకుని ఢిల్లీకి పారిపోయాడు. బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌కు చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి, ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడు.

ఆనూ పానూ చూసి, పథకం ప్రకారం  
బాధితురాలి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి దంత వైద్యురాలు. వీరి ఇంట్లో పది నెలల పాటు పనిచేశాడు. కుటుంబ సభ్యుల అలవాట్లు, ఇంటి భద్రతా వ్యవస్థపై అతనికి పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారు. పనిమనుషుల కోసం మెయిన్ డోర్ దగ్గర ఒక 'స్మార్ట్ కార్డ్' (తాళం) దాచి ఉంచేవారు. ఈ విషయం తెలిసిన రాహుల్, వారు జిమ్‌కు వెళ్లగానే ఆ కార్డుతో లోపలికి ప్రవేశించాడు.

తన ఫోన్‌లలో ఒకదాన్ని రూ. 10వేలకు అమ్మేశాడు. ఆ తరువాత ఆ డబ్బుతో ఒక వ్యాన్‌ను అద్దెకు తీసుకుని, డ్రైవర్‌కు రూ. 6,000 ఇస్తానని నమ్మ బలికాడు.  కానీ అతనికి డబ్బులివ్వకుండానే ఢిల్లీ చేరుకుని, ఉదయం 6:39 గంటలకు ఇంట్లోకి వెళ్లిన నిందితుడు, కేవలం 40 నిమిషాల్లోనే (7:15 గంటలకు) ఈ ఘాతుకానికి పాల్పడి బయటకు వచ్చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది.

నిందితుడికి ఆన్‌లైన్ జూదానికి (Gambling) బాగా అలవాటు పడ్డాడు. ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పులు చేస్తున్నాడనే కారణంతో రెండు నెలల క్రితమే ఆ కుటుంబం అతడిని పనిలో నుంచి తీసేసింది. ఈ పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు అతడి కోసం వెతుకుతుండగానే, నిందితుడు ఢిల్లీలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

అది తప్పు...కానీ
విచారణ సందర్భంగా, "మీరు ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు?" అని కోర్టు నిందితుడిని ప్రశ్నించినపుడు  డబ్బు దొంగిలించడానికే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పాడు.మరి మరి ఇతర నేరాలు ఎందుకు చేశావు?" అని అడగ్గా. అది తప్పే.. కానీ  ఇప్పుడు తానేమీ చెప్పలేనని’’ బదులిచ్చాడు.

రాహుల్ మీనాను, ఢిల్లీ న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ద్వారకాలోని ఒక హోటల్ నుండి అరెస్టు చేసిన అనంతరం, మీనాను న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడిని నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించ డానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసు విజ్ఞప్తిని ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా ఠాకరన్ ఆమోదించారు. మరోవైపు దొంగిలించిన డబ్బు, నగలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. అయితే, కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నారేమోనని పరిశీలించడానికి, అతడిని విచారించడానికి తమకు మరింత సమయం అవసరమని తెలిపారు.
ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!

Advertisement
 
Advertisement
Advertisement