చెన్నై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ శనివారం చెన్నైలో సమావేశమయ్యారు. విజయ్ నివాసంలోనే ఇద్దరు నేతలు సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం సమీపంలోని కేఫ్‌కు వెళ్లి కాఫీ, తిరమిసు, కుకీస్‌ను రుచి చూశారు. దీంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.
చెన్నైలోని నీలాంకరైలో ఉన్న తన నివాసం వద్దకు వచ్చిన రాహుల్ గాంధీకి విజయ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేఫ్‌కు వెళ్లిన నేతలు అక్కడికి వచ్చిన అభిమానులతో ముచ్చటించారు. అనంతరం కొందరితో సెల్ఫీలు దిగారు.
రాహుల్ గాంధీ చెన్నైలో నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ పేరుతో జరగనున్న యువజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితులు ఏర్పడటంతో కాంగ్రెస్, టీవీకే చేతులు కలిపిన విషయం తెలిసిందే. గతంలో డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్.. విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జరిగిన రాహుల్, విజయ్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక చర్చలతో పాటు ఇద్దరి మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్ ఘటనపై కేంద్రం సీరియస్.. ఎన్ఐఏ కేసు నమోదు


