
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం
ప్రధానిపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ: భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నా, ప్రధాని నరేంద్ర మోదీ దానిపై ఎందుకు నోరు విప్పడం లేదని లోక్‌సభ ప్రతిపక్షనాయకుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.‘‘కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని ట్రంప్ ఇప్పటికో 25 సార్లు చెప్పారు.
అసలు మనదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడానికి ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు. అయినా.. ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు’’అని ఆయన మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పట్ల పరస్పర వైరుధ్య వ్యాఖ్యలు చేయడాన్ని రాహుల్ ఎత్తి చూపారు. ‘ఒకవైపు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది అంటున్నారు, మరోవైపు, విజయం సాధించామంటున్నారు. అది కొనసాగుతోందా? లేదా ముగిసిందా? మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపానని ట్రంప్ చెబుతున్నారు.
కాబట్టి ‘కుచ్ తో దాల్ మే కాలా హై నా’(ఏదో తేడాగా ఉంది)’అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్–పాక్‌ల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే నిరోధించానని పునరుద్ఘాటించడాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత విదేశాంగ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను ఒంటరి చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ వాదన కారణంగానే ప్రధాని మోదీ పార్లమెంటుకు దూరంగా ఉంటున్నారన్నారు.
ఓటర్ల జాబితా సవరణ ఎన్నికల మోసం..
బీహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా సవరణను కూడా రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ప్రక్రియను బీజేపీ ఎన్నికల మోసంగా ఆయన అభివరి్ణంచారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని గుర్తు చేశారు. ‘బిహార్‌లో 52 లక్షల మంది మాత్రమే కాదు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసం చేశారు. ఓటర్ల జాబితాను చూపించమని ఈసీని అడిగితే నిరాకరించింది. వీడియోగ్రఫీ గురించి అడిగితే నియమాలను మార్చేసింది. మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లను చేర్చారు. కర్ణాటకలో భారీ మోసాన్ని బయటపెట్టి.. ఎన్నికల కమిషన్ ముందుంచాం.
తమ ఆటలు ఇక చెల్లవని తెలిసి ఓటర్లను తొలగించారు’అని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ సమరి్థంచారు. కీలకమైన విషయాలపై చర్చించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ట్రంప్ తన కాల్పుల విరమణ ప్రకటనతో రజతోత్సవం జరుపుకుంటున్న సమయంలో, ప్రధానమంత్రి పూర్తిగా మౌనంగా ఉన్నారు. విదేశాలకు వెళ్లడానికి, స్వదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరచడానికి మాత్రమే సమయం వెతుక్కుంటున్నారు’అని ఆయన ఎక్స్‌లో ఎద్దేవా చేశారు.