‘ప్రచండ్‌’లో రాష్ట్రపతి  | President flew as co-pilot in the indigenous light combat helicopter Prachand | Sakshi
Sakshi News home page

‘ప్రచండ్‌’లో రాష్ట్రపతి 

Feb 28 2026 5:03 AM | Updated on Feb 28 2026 5:03 AM

President flew as co-pilot in the indigenous light combat helicopter Prachand

యుద్ధ హెలికాప్టర్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు  

జైపూర్‌:  తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కో–పైలట్‌గా వ్యవహరించారు. ఆలివ్‌ గ్రీన్‌ ఫ్లయింగ్‌ సూట్, హెల్మెట్‌ ధరించి, హెలికాప్టర్‌లో 25 నిమిషాల పాటు ప్రయాణించారు. రాజస్తాన్‌ రాష్ట్రం జైసల్మేర్‌ జిల్లాలో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు సమీపంలో శుక్రవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రపతి జైసల్మేర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన ప్రచండ్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. కాక్‌పిట్‌లో కూర్చున్న తర్వాత ఐఏఎఫ్‌ సిబ్బందికి, అధికారులకు అభివాదం చేశారు.

 త్రివిధ దళాల సుప్రీంకోర్టు కమాండర్‌ హోదాలో కాక్‌పిట్‌ నుంచి ఒక సందేశం విడుదల చేశారు. భారతదేశ స్వయం స్వావలంబనకు ప్రచండ్‌ హెలికాప్టర్‌ ఒక ప్రతీక అని పేర్కొన్నారు. జైసల్మేర్‌ జిల్లా భూభాగంపై ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నానని వెల్లడించారు. మన వీర సైనికులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని స్పష్టంచేశారు. ‘జై హింద్, జై భారత్‌’అంటూ ఉద్ఘాటించారు. పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌ మీదుగా ప్రచండ్‌ ప్రయాణించింది. అంతకుముందు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద రాష్ట్రపతి ముర్ముకు ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ స్వాగతం పలికారు. యుద్ధ హెలికాప్టర్‌లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము రికార్డుకెక్కారు. ఆమె గతంలో రఫేల్, సుఖోయ్‌ లాంటి యుద్ధ విమానాల్లో విహరించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement