రష్యాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమించిన పేదింటి భారతీయుడు.. స్వదేశానికి తిరిగొచ్చాడు. అతడి ఆచూకీ తెలుసుకుని ఆమె ఏకంగా బిహార్‌కు వచ్చింది. ఎలాగైతేనేం ఆ ఎక్ ప్రేమ్ కహానీకి శుభం కార్డు పడింది!. నవంబర్‌లో వీరిద్దరికీ పెళ్లి జరగనుందని, ఇరు కుటుంబాలూ ఇందుకు అంగీకరించాయి. ఈ కథ తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, ఈ స్క్రిప్ట్‌లో విస్తుపోయే విషయం బయటపడింది ఇప్పుడు.
వైరల్ కథనం ప్రకారం.. బిహార్‌లోని భాగల్పూర్కు చెందిన రాహుల్ యాదవ్ పని కోసం రష్యాకు వెళ్లాడు. అక్కడ జూలీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. అనంతరం రాహుల్ స్వదేశానికి తిరిగిరాగా, అతడిని వెతుక్కుంటూ జూలీ బిహార్‌కు వచ్చింది. పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైంది. దీంతో మాములు ప్రేమ కథ కాదంటూ తెగ ప్రచారం జరిగింది.
అయితే, ఓ జాతీయ మీడియా జరిపిన ఫ్యాక్ట్ చెక్‌లో అసలు మోసం బయటపడింది. వీడియోలో కనిపించిన యువకుడి అసలు పేరు నమిత్. అతడు భాగల్పూర్కు చెందినవాడు కాదు.. బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందినవాడు. ఇక యువతి పేరు జూలీ కాదు. ఆమె ఆండ్రియా కొనాలి. అంతేకాదు.. ఆమె రష్యాకు చెందిన యువతి కూడా కాదు.
వైరల్ వీడియోలో కనిపించిన యువతీ యువకులు ప్రేమికులు కారని, ప్రచారంలో చెప్పిన వివరాలన్నీ అవాస్తవాలని ఆ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.
🚨 BHAGALPUR, BIHAR : A man from Bihar reportedly travelled to Russia for work, where he fell in love with a Russian woman. The couple has now arrived in India and is reportedly planning to get married in November, with the woman willing to live in his village. https://t.co/kR0xgFdUHw
— indiainlast24hr (@indiain24hr) October 14, 2026
ఎన్జీవో కార్యక్రమం కోసం..
ఆండ్రియా కొనాలి బ్రిటన్‌కు చెందిన శివియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఆమె బిహార్‌లో పర్యటించారు. స్థానికంగా పనిచేస్తున్న సాథి అనే సంస్థతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్టోబర్ 7, 8 తేదీల్లో ఆరుగురు మహిళల బృందం పూర్ణియా జిల్లాకు వచ్చింది. ఆ బృందంలో ఆండ్రియా కూడా ఉన్నారు.
గ్రామాల్లో మహిళలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు, వారు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు విదేశీ అతిథులకు గులాబీల బొకేతో స్వాగతం పలికారు. ఆండ్రియా కొన్ని ఇళ్లను కూడా సందర్శించారు. విదేశీ మహిళలు గ్రామంలో తిరుగుతుండటంతో వారిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నమిత్ కూడా ఆ గుంపులో ఉన్నాడు.
పాపం ఆండ్రియా..
వైరల్ వీడియోలో ఆండ్రియా చేతిలో కనిపించిన పూల బొకేను చూపిస్తూ, యువతి తన ప్రియుడి ఇంటికి వచ్చిందని ప్రచారం చేశారు. కానీ వాస్తవం వేరే. గ్రామానికి వచ్చిన అతిథులకు స్వాగతం పలికే క్రమంలో స్థానిక మహిళలు ఆ బొకేను అందించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలనే వక్రీకరించి ప్రేమకథగా చిత్రీకరించారు. దీంతో వృత్తిపరమైన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన యువతి వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం మొదలైంది.
నమిత్ రష్యాకు వెళ్లి అక్కడ యువతితో ప్రేమలో పడ్డాడన్న ప్రచారాన్ని స్థానికులు ఖండించారు. అతడు ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదని మీడియాకు తెలిపారు. విదేశీ మహిళలు గ్రామానికి వచ్చారని తెలిసి పక్క గ్రామానికి వెళ్లాడని వివరించారు. మరోవైపు.. ఆ జాతీయ మీడియా సంస్థ నమిత్‌ను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించింది. అయితే, వారు వెళ్లిన సమయంలో అతడు ఇంట్లో లేడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉంది. దీంతో ఈ వ్యవహారంపై అతడి వివరణను తెలుసుకోవడం సాధ్యం కాలేదు.
వీడియోను మొదట ఎవరు చిత్రీకరించారు? దానికి తప్పుడు ప్రేమకథను జోడించి ఎవరు వైరల్ చేశారు? ఇందులో నమిత్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఒకవేళ చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తే, ఈ వ్యవహారంలో నమిత్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని సాథి సంస్థ నిర్వాహకులు తెలిపారు.
లీగల్ చర్యల దిశగా సాథి సంస్థ..
ఈ ఘటనపై సాథి సంస్థ సమన్వయకర్త అభిషేక్ కుమార్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంస్థకు అతిథులుగా వచ్చిన మహిళల వీడియోలను తప్పుడు కథనాలతో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా పెద్ద, చిన్న మీడియా సంస్థలు సైతం ఈ కథనాన్ని ప్రచురించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం సంస్థల ప్రతిష్ఠకే కాకుండా, దేశం గురించి ఇతరులకు వెళ్లే సందేశంపైనా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: స్వీట్స్ అడిగాడు.. ఊరే వదిలి పారిపోయేలా చేశారు


