2026లో ఎవరిది పైచేయి?.. ఐదు రాష్ట్రాల్లో అగ్ని పరీక్ష!
బెంగాల్, తమిళనాట నువ్వా–నేనా?
దీదీకి ‘యాంటీ’గండం.. స్టాలిన్‌కు ‘విజయ్’భయం!
పెద్దల సభలో పట్టు కోసం పావులు మారనున్న దేశ రాజకీయ ముఖచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో మహా సంగ్రామానికి తెరలేచింది. 2025లో ఢిల్లీ, బిహార్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్ నుంచి రాజకీయ పార్టీలు తేరుకోకముందే 2026 రూపంలో మరో సవాల్ ముందుకొచ్చింది. కొత్త సంవత్సరం సాక్షిగా ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు తెర తీయనుంది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటులో కీలకమైన రాజ్యసభ సీట్ల భర్తీ ఈ ఏడాదే జరగనుండటంతో ఢిల్లీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలు కేవలం అధికార మారి్పడి కోసమే కాదు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు హెచ్చరికలుగా, సెమీఫైనల్స్‌గా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
బెంగాల్ రణరంగం: మమత కోటలో కమలం వికసించేనా?
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరు పశ్చిమ బెంగాల్‌లోనే జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని నేతగా ఎదిగిన మమకు ఈసారి సొంతగూటి నుంచే అసమ్మతి సెగలు తగులుతున్నాయి. సందేశ్‌ఖాలీ ఘటనలు, రేషన్, విద్యాశాఖ కుంభకోణాలు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారేలా చేశాయి.
అయితే‘లక్ష్మీర్ భండార్’ వంటి పథకాలతో మహిళా ఓటు బ్యాంకును మమత పదిలపరుచుకున్నారు. గత ఎన్నికల్లో 77 సీట్లతో సత్తా చాటిన బీజేపీ ఈసారి ఎలాగైనా మమతను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవి్వళ్లూరుతోంది. ముక్కోణపు పోటీలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి ఓట్లు చీలితే అది అంతిమంగా ఎవరికి లాభం చేకూరుస్తుందన్నదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం.
ద్రవిడ గడ్డపై ‘సినిమా’ చూపించేదెవరు?
తమిళనాట రాజకీయాలు ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే చుట్టూనే తిరిగేవి. కానీ, ఈసారి తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, నటుడు విజయ్ రూపంలో సరికొత్త శక్తి దూసుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని నమ్ముతుంటే అన్నాడీఎంకే పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. యువతలో పిచ్చ క్రేజ్ ఉన్న విజయ్ ఎవరి ఓట్లకు గండి కొడతారన్నదే అసలు సిసలు ట్విస్ట్. విజయ్ చీల్చే ప్రతి ఓటు అధికార డీఎంకేకు నష్టమా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల స్టాలిన్‌కే లాభమా? అన్నది ఆసక్తి రేపుతోంది. అన్నామలై సారథ్యంలో బీజేపీ తమిళనాట పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది.
కేరళలో సంప్రదాయం..
అస్సాంలో హిందుత్వ అజెండా
సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే ఆనవాయితీ ఉంది. దాన్ని 2021లో బ్రేక్ చేసిన పినరయి విజయన్ ఈసారి ఆర్థిక సంక్షోభం, సహకార బ్యాంకుల కుంభకోణాల రూపంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ కూటమి (యూడీఎఫ్) అధికారం చేపట్టాలని చూస్తుండగా బీజేపీ క్రైస్తవ వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది. అటు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘హిందుత్వ’ అజెండా, నియోజకవర్గాల పునరి్వభజన బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇక్కడ మతపరమైన ఓట్ల చీలికే గెలుపోటములను శాసించనుంది.
ఢిల్లీలో పైచేయి కోసం రాజ్యసభ ఫైట్
కేవలం అసెంబ్లీలే కాదు దేశ చట్టసభల్లో ఎగువ సభ అయిన రాజ్యసభలోనూ ఈ ఏడాది భారీ మార్పులు జరగనున్నాయి. ఏకంగా 73 మంది ఎంపీల పదవీకాలం ముగియనుంది. ఈ సీట్లను దక్కించుకోవడం కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కు అనివార్యంగా మారింది. వక్ఫ్ సవరణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులు రాజ్యసభలో గట్టెక్కాలంటే బీజేపీకి మెజారిటీ అత్యవసరం. అందుకే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజ్యసభ గణితాన్ని, తద్వారా దేశ పరిపాలనా విధానాన్ని ప్రభావితం చేయనున్నాయి.
ఫలితాలను తారుమారు చేసే పంచ సూత్రాలు
ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఐదు అంశాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.
మొదటిది మహిళా ఓటర్లు; బెంగాల్, తమిళనాడులో మహిళలే నిర్ణయాత్మక శక్తి.
రెండోది యువత; ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆగ్రహం ప్రభుత్వాలను మార్చే శక్తి కలిగి ఉంది.
మూడోది కుల, మత సమీకరణాలు; ముఖ్యంగా అస్సాం, బెంగాల్‌లో ఇది కీలకం.
నాలుగోది అధికార వ్యతిరేకత; ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న పారీ్టలపై ప్రజల్లో ఉండే అసహనం.
ఐదోది పొత్తులు; విపక్షాల అనైక్యత అధికార పారీ్టలకు వరంగా మారుతోంది. మొత్తానికి 2026 ఎన్నికలు 2029 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా నిలువనున్నాయనడంలో సందేహం లేదు. మరి ఓటరు ప్రాంతీయ అస్తిత్వానికి పట్టం కడతారా? జాతీయ భావజాలానికి జై కొడతారా? అనేది కాలమే నిర్ణయించాలి.


