BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?.. | Sakshi
Sakshi News home page

BJP Vs Congress: ఈశాన్య ఢిల్లీ ఎవరిది?..

Published Tue, May 21 2024 11:54 AM

Political Fight Between Congress And BJP At North East Delhi Seat

ఈశాన్య ఢిల్లీ నుంచి మూడోసారి బ‌రిలో దిగిన సిట్టింగ్ ఎంపీ మ‌నోజ్ తివారీ

ఏడుగురు సిట్టింగ్‌ల‌లో ఆరుగురిని మార్చినా, మ‌నోజ్ తివారీని క‌ద‌ల్చ‌ని బీజేపీ

ఈసారి గెలిస్తే మ‌నోజ్ తివారీకి కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే

మ‌నోజ్ తివారీపై క‌న్హ‌య్య కుమార్‌ను రంగంలోకి దింపిన రాహుల్ గాంధీ

పీసీసీ అధ్యక్షుడు లవ్లీని ప‌క్క‌న‌బెట్టి బీహార్‌కు చెందిన క‌న్హ‌య్య‌కుమార్‌పై న‌మ్మ‌కం పెట్టిన రాహుల్‌

దీంతో కాంగ్రెస్ అధ్య‌క్ష‌ ప‌ద‌వికి రాజీనామా చేసి ల‌వ్లీ

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న సీటు ఈశాన్య ఢిల్లీ. హ్య‌ట్రిక్‌పై క‌న్నేసిన బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీపై, యువ‌నాయ‌కుడు క‌న్హ‌య్య కుమార్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. గ‌త ఎన్నిక‌ల్లో  బెగుస‌రాయ్‌లో ఓడిపోయిన క‌న్హ‌య్య‌కుమార్‌ను రాహుల్ గాంధీ ఈసారి ఢిల్లీలో పోటీకి దింప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 20శాతం ముస్లింలు, 11శాతం ఎస్సీల స‌మీక‌ర‌ణను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ ప్ర‌యోగానికి దిగింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈశాన్య ఢిల్లీ ప్రాంతం దేశ రాజధానిలో అతిపెద్ద జిల్లా. నార్త్ ఈస్ట్ సీటు భారతదేశం మొత్తంలో అత్యంత జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యధిక జనాభా పూర్వాంచల్‌కు చెందినవారే. ఈ లోక్‌సభ స్థానంలో అనేక అనధికార కాలనీలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు స్థిరపడ్డారు. ఉత్తరప్రదేశ్‌తో ఈశాన్య ఢిల్లీ సరిహద్దు కారణంగా, ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా నుండి వలస వచ్చిన వారి జనాభా ఎక్కువగా ఉంది.

ఈ లోక్‌సభ స్థానంలో భ‌జ‌న్‌పురా, బురారీ, తిమర్‌పూర్, సీలంపూర్, ఘోండా, బాబర్‌పూర్, గోకల్‌పూర్, సీమాపురి, రోహతాస్ నగర్, ముస్తఫాబాద్, కరవాల్ నగర్‌లతో కలిపి 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 16.3 శాతం షెడ్యూల్డ్ కులాలు, 11.61 శాతం బ్రాహ్మణులు, 20.74 శాతం ముస్లింలు, 4.68 శాతం వైశ్య (బనియా), 4 శాతం పంజాబీ, 7.57 శాతం గుర్జార్ మరియు 21.75 శాతం ఓబీసీ కమ్యూనిటీ వారి వాటాను కలిగి ఉంది.

గ‌తంలో 2009 లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీపై కాంగ్రెస్‌ 59.03 శాతం ఓట్లతో భారీ ఆధిక్యం సాధించగా బీజేపీకి 33.71 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 నుంచి వ‌రుస‌గా బీజేపీ విజ‌య‌కేతనం ఎగ‌రేస్తోంది. 2014లో సినీ నటులు మనోజ్ తివారీకి 45.38 శాతం ఓట్లతో గెలుపొంద‌గా, 2019లో 53.86 శాతం రెండోసారి విజ‌య‌కేత‌నం అందుకున్నారు. ఈ సీటులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ల అభ్యర్థులకు ప్రజల్లో మంచి పేరుంది.

ఒకవైపు రాజకీయాలకు అతీతంగా నటుడిగా, గాయకుడిగా మనోజ్ తివారీ బాగా పాపులర్ అయితే, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్  జేఎన్‌యూ స్టూడెంట్ లీడ‌ర్‌గా దేశ‌వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్హయ్య కుమార్ కూడా చాలా చురుకుగా కనిపించారు. ఈ యాత్రలతో యువతను కనెక్ట్ చేయడంలో ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే తుక్‌డేతుక్‌డే గ్యాంగ్ నాయ‌కుడ‌ని బీజేపీ.. క‌న్హ‌య్య కుమార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోంది.  

ఢిల్లీలో బీజేపీ సీఎం అభ్యర్థి మారేందుకు ఈ ఎన్నిక మ‌నోజ్ తివారీకి కీల‌కంగా మార‌నుంది. ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచి స‌త్తా చాటిన తివారీ మూడోసారి హ్యాట్రిక్ సాధించ‌డం ద్వారా ఢిల్లీ బీజేపీ అగ్ర‌నాయ‌కుడిగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవ‌కాశం ఉంది. ఢిల్లీ బీజేపీకి నాయ‌కుడు లేక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడుతున్న పార్టీకి తివారీ సార‌థ్యం వ‌హించ‌డానికి ఇదొక అవ‌కాశమ‌నే అంచ‌నాలొస్తున్నాయి.

ఇటు షీలా దీక్షిత్ త‌ర్వాత ఢిల్లీకి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ లీడ‌ర్ క‌రువ‌య్యారు. క‌న్హ‌య్య కుమార్ గ‌నుక ఈశాన్య ఢిల్లీ నుంచి గెలిస్తే ఆయ‌న కూడా ఢిల్లీ కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ సీఎం లీడ‌ర్‌గా ఎదిగే అవ‌కాశ‌ముంది. మ‌రి ఈసారి ఢిల్లీ ఈశాన్యంలో క‌మ‌లం ఉద‌యిస్తుందా? హ‌స్త రేఖ‌లు మార‌తాయా? అన్న‌ది ఓట‌రు చేతిలో ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement