
వారణాసి: ‘ఆ మహాదేవుని ఆశీస్సులతో పహల్గామ్ దాడిపై ప్రతీకారం తీర్చుకున్నాం. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాశివుని పాదాలకు అంకితమిస్తున్నాను’ అని ప్రధాని మోదీ వారణాసి పర్యటనలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వం తదితర కీలక రంగాల విస్తరణకు ఉద్దేశించిన ప్రాజెక్టులను యూపీలోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
శనివారం ఉదయం 11 గంటలకు ప్రదాని మోదీ వారణాసిలో అడుగుపెట్టారు. అనంతరం దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి కాశీకి వచ్చాను. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్‌లో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు దారుణంగా హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాల వేదన నా హృదయాన్ని ద్రవింపజేసింది. బాధిత కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని నేను కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థించాను’ అని అన్నారు.
#WATCH | Varanasi, UP: Prime Minister Narendra Modi lays the foundation stone and inaugurates multiple development projects worth around Rs 2200 crores.
Source: DD pic.twitter.com/m7fKAvi3g5— ANI (@ANI) August 2, 2025
ఈ కార్యక్రమంలో ప్రధాని.. కిసాన్ సమ్మాన్ నిధి 20వ వాయిదాను 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. దాదాపు రూ.2200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని మోదీని సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పదవిలో ఉంటూ వారణాసిని 51వ సారి సందర్శించారు. ఆయన నగరంలో దాదాపు మూడు గంటల పాటు ఉండనున్నారు. కిసాన్ నిధిని ప్రదాని మోదీ వారణాసి నుండి రైతులకు పంపిణీ చేయడం ఇది రెండవసారి. ఈరోజు ప్రధాని మోదీ రామ్‌కుండ్, మందాకిని, శంకుల్ధార, ఇతర ప్రాంతాలతో సహా వివిధ కుండ్‌లలో నీటి శుద్ధి, నిర్వహణ పనులకు పునాది రాయి వేయనున్నారు. జల్ జీవన్ మిషన్ కింద 47 గ్రామీణ తాగునీటి పథకాలను ప్రారంభించనున్నారు. ‘కాశీ సంసద్ ప్రతియోగిత’ కింద స్కెచింగ్ పోటీ, పెయింటింగ్ పోటీ, ఫోటోగ్రఫీ పోటీ పోటీల కోసం రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
పండిట్ మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్, హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో రోబోటిక్ సర్జరీ సెంటర్‌లకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనకు ముందు ట్విట్టర్‌లో ‘ఆగస్టు 2వ తేదీ కాశీలోని నా కుటుంబ సభ్యులకు చాలా ప్రత్యేకమైన రోజు. రేపు ఉదయం 11 గంటలకు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యాటకం, కనెక్టివిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నాను. అలాగే పీఎం పీఎం కిసాన్ పథకం 20వ విడత నిధులను విడుదల చేయనున్నాను’ అని పేర్కొన్నారు.