స్థానిక ఉత్పత్తులే కొనండి

అప్పుడే నిరుద్యోగం పోతుంది: మోదీ
దేశమంతటా హనుమాన్ విగ్రహాలు
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు.
ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్‌జీ చార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి.
3 రోజులు గుజరాత్‌కు మోదీ
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది.
అల్లర్లపై మాట్లాడరేం?
శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు