
కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై సమీక్షా సమావేశంలో ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు.
జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీ
ఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది.