సవాళ్లున్నా మున్ముందుకే

PM Narendra Modi launches Rozgar Mela, 75,000 people to get appointment letters - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన 

రోజ్‌గార్‌ మేళా ప్రారంభం

75,000 మందికి నియామక పత్రాలు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించిన ‘రోజ్‌గార్‌ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్‌ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉద్ఘాటించారు.

అడ్డంకులను అధిగమించాం..  
‘‘అంతర్జాతీయంగా పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న మాట ముమ్మాటికీ వాస్తవం. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. శతాబ్దానికి ఒకసారి కనిపించే కోవిడ్‌–19 లాంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. ఈ విషయం ఎవరూ ఆలోచించడం లేదు. కరోనా వైరస్‌ ప్రపంచమంతటా ప్రతికూల ప్రభావం చూపింది. అయినప్పటికీ ఇలాంటి సమస్యల నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. రిస్క్‌లు తీసుకున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు.

ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ  
మన ప్రభుత్వ విభాగాల పనితీరు, సామర్థ్యం ఎంతగానో మెరుగుపడింది. ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్‌ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా..
డ్రోన్‌ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్‌ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్‌ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్‌ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని మోదీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top