
పాకిస్తాన్ ఆలోచన అలాగే ఉంది
మనం పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది
పాక్ ప్రజలు ఇకనైనా మేల్కొనాలి
రోటీ కావాలో తూటా కావాలో తేల్చుకోండి
పాకిస్తానీయులకు ప్రధాని మోదీ హితవు
గుజరాత్‌లో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ
భుజ్/వడోదర: ఆపరేషన్ సిందూర్‌తో భారత ఆర్మీతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, సైన్యం, పాలకులకు బుద్ధిచెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ దేశ ప్రజలకూ హితవు పలికారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వం, సైన్యానికి ఆదాయ వనరుగా మారిందని, ఇకనైనా మీరు మేల్కొనాలని పాక్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా సొంత రాష్ట్రం గుజరాత్‌లో సోమవారం పర్యటించిన ప్రధాని మోదీ దాహోద్, భుజ్, గాం«దీనగర్‌లలో రూ.82,950 కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలు చేశాక భుజ్, దాహోద్‌లలో బహిరంగ సభల్లో ప్రస ంగించారు.
పాక్ సరిహద్దులోని కఛ్ జిల్లాలోనూ మోదీ పర్యటించారు. ‘‘భారత్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే పర్యాటకంలా ప్రోత్సహిస్తోంది. పాక్ ఈ తరహా పంథా కేవలం వాళ్లనే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది. పాకిస్తాన్ ప్రజలకు ఒక్కటే చెబుతున్నా. మీ ప్రభుత్వం, సైన్యం ఉగ్రవాదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇకనైనా ఉగ్రవాదానికి అంతం పలికేందుకు మీరంతా ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంత జీవనం గడపండి. కడుపారా తినండి. రోటీ కావాలో మా తూటా కావాలో మీరే నిర్ణయించుకోండి. మిమ్మల్ని ఒక్కటే అడగదల్చుకున్నా. మేం 11 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినప్పుడు భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. నేడు జపాన్‌ను దాటేసి భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి మీరేం సాధించారు?. మీ పరిస్థితేంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మీ ప్రభుత్వాలు, సైన్యం మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ ధోరణి సరైందో కాదో యువతే నిలదీయాలి. మిమ్మల్ని ఆర్మీ, పాలకులు అంధకారంలోకి నెట్టేస్తున్నారు’’అని మోదీ పాక్ ప్రజలకు హితవు పలికారు.
పక్షం రోజులు వేచి చూశా
‘‘పహల్గాంలో పాశవిక ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కఠిన చర్యల కత్తి పట్టుకుంటుందేమోనని 15 రోజులపాటు వేచి చూశా. కానీ ఉగ్రవాదమే పాకిస్తాన్‌కు తిండిపెడుతోందని స్పష్టమైంది. అందుకే పాక్‌పై దాడులకు మా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. మే 9న భారత సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడులకు తెగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దాడి చేసి మేం పాక్ వైమానిక స్థావరాలను నేలమట్టంచేశాం’’అని మోదీ అన్నారు. తర్వాత మోదీ 1971లో పాక్ బాంబుదాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌ఫీల్డ్‌ను 72 గంటల్లో పునర్‌నిర్మించిన మధాపార్ గ్రామంలోని 300 మంది మహిళలతో మోదీ మాట్లాడారు. వీళ్లు మోదీకి సిందూర్ మొక్కను బహూకరించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీనిని నాటుతానని మోదీ చెప్పారు.
మూడు రోడ్‌షోలు
తొలుత గుజరాత్ పర్యటనలో భాగంగా సోమవారం మోదీ ఏకంగా మూడు రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఉదయం వడోదరలో భారీ రోడ్‌షో చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించి దేశం దృష్టిని ఆకర్షించిన కల్నల్ సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, కవల సోదరి షాయనా సున్‌సారా కూడా ఈ రోడ్‌షోలో పాల్గొనడం విశేషం. ఖురేషి స్వస్థలం వడోదరే. రోడ్ షో సందర్భంగా జనం జాతీయ జెండాలు చేతపట్టుకుని సైన్యాన్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. మోదీ కారు నుంచి బయటకొచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం భుజ్‌లో, అహ్మదాబాద్‌లో కూడా మోదీ రోడ్‌షోలు చేశారు. రాష్ట్రంలో మొత్తం రూ.82,950 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.