
న్యూఢిల్లీ: ఐదేళ్లలో రూ.362 కోట్లు ఖర్చు అంటే.. ఇదేదో ప్రాజెక్టుకు అనుకునేరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు. 2021 నుంచి 2025 మధ్య ఆయన విదేశీ పర్యటనలకోసం అక్షరాలా రూ.362కోట్లు ఖర్చయ్యాయి. ఒక్క 2025లోనే ఆయన పర్యటనలకోసం రూ.67కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇందులో..
అమెరికా, ఫ్రాన్స్ ఉన్నతస్థాయి పర్యటనలు సహా ఐదు పర్యటనలు న్నాయి. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ అడిగిన ప్రశ్నకు సమా« దానంగా విదేశాంగ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను రాజ్యసభకు అందించారు. ఈ డేటా ప్రకారం, 2025లో ప్రధాని పర్యటనల్లో అత్యంత ఖరీదైనది ఫ్రాన్స్ పర్యటన. దీనికి రూ. 25 కోట్లకు పైగా.. ఆ తర్వాత అమెరికా పర్యటనకు రూ. 16 కోట్లకు పైగా ఖర్చయింది.
మారిషస్, సైప్రస్, కెనడా దేశాల అదనపు సందర్శనల ఖర్చులు ఇంకా వీటికి కలపలేదు. ఇక 2024 లో రష్యా, ఉక్రెయిన్‌తో సహా 16 దేశాల్లో పర్యటించడానికి రూ.109 కోట్లు ఖర్చు చేశారు. 2023లో దాదాపు రూ.93 కోట్లు, 2022లో రూ.55.82 కోట్లు, 2021లో రూ.36 కోట్లు ఖర్చు చేశారు. 2021లో అమెరికా పర్యటనకే రూ.19 కోట్లకు పైగా ఖర్చయింది. ఇవి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా.. పర్యటనలకు సంబంధించిన ప్రకటనలు, ప్రసార ఖర్చుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.