
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 28) తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 126వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. ముందుగా ఆయన స్వాంతత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌కు నివాళులర్పించారు. భగత్ సింగ్ ప్రతి భారతీయునికి, ముఖ్యంగా దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకుడని అన్నారు. ఉరి తీయడానికి ముందు భగత్ సింగ్.. బ్రిటిష్ వారికి ఒక లేఖ రాశారు. ‘నన్ను, నా సహచరులను యుద్ధ ఖైదీలుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఉరితీయడంతో కాకుండా నేరుగా కాల్చి చంపడం ద్వారా మా ప్రాణాలను తీయాలి’ అని ఆయన కోరారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
లతా మంగేష్కర్ జయంతి కూడా ఈ రోజే కావడంతో ప్రధానమంత్రి ఆమెను స్మరించుకున్నారు. ఆమె పాడిన దేశభక్తి గీతాలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని అన్నారు. లతా దీదీకి హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు. ఆమె ప్రతి సంవత్సరం తప్పకుండా నాకు రాఖీ పంపేదని ప్రధాని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపతో సంభాషించారు. ఈ ఇద్దరు ధైర్యవంతులైన అధికారులను ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నానని అన్నారు.
Sharing this month's #MannKiBaat. Do hear!
https://t.co/oKMc16cIzt— Narendra Modi (@narendramodi) September 28, 2025
ఛత్ పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. ఛత్ పూజ సూర్య దేవునికి సంబంధించిన పూజ. భక్తులు అస్తమించే సూర్యుని ముందు ప్రార్థనలు చేస్తారని ప్రధాని వివరించారు. ఈ పండుగ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందన్నారు. ఛత్ పూజ దీపావళి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ. భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాల కారణంగా, కోల్‌కతా దుర్గా పూజ కూడా యునెస్కో జాబితాలో భాగమైంది. మన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తే, ప్రపంచం కూడా వాటి గురించి తెలుసుకుంటుందని మోదీ పేర్కొన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కొన్ని ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. గత 11 ఏళ్లలో దేశ ప్రజలలో ఖాదీపై ఆకర్షణ గణనీయంగా పెరిగిందన్నారు. మన చేనేత, హస్తకళల రంగం కూడా గణనీయమైన మార్పులను చూస్తోందన్నారు. ఇదే కార్యక్రమంలో 100 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. త్యాగం, సేవా స్ఫూర్తి, క్రమశిక్షణ సంఘ్‌కున్న నిజమైన బలమని ప్రధాని అన్నారు. లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు తమ ప్రతి ప్రయత్నంలో దేశం ముందు అనే స్ఫూర్తితో ముందడుగు వేస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.