ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్‌పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.
ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.
ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.


