
పట్నా: అక్కడ అంగరంగ వైభవంగా వివాహం జరుగుతోంది. అతిథులంతా ఉత్సాహంగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఉత్సాహాన్ని రెండింతలు చేసేందుకు డ్యాన్సర్లను పిలిపించారు. అంతా సవ్యంగా సాగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డ్యాన్సర్లంతా కలిసి వరుణ్ణి కిడ్నాప్ చేశారు. అతిథులంతా అవాక్కయ్యారు.
బీహార్(Bihar)లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. సాధు చౌక్ మొహల్లాలో పెళ్లిలో వినోదం కోసం పిలిచిన డాన్స్ టీమ్ వరుణ్ణి కిడ్నాప్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బైకుంఠపూర్ పరిధిలోని దిఘ్వా దుబౌలీలో సురేంద్ర శర్మ కుమార్తె వివాహం జరుగుతోంది. వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరేగింపుగా వస్తున్న మగపెళ్లివారిని ఆహ్వానించేందుకు డాన్స్ బృందాన్ని పిలిపించారు. అయితే వీరికి స్థానికులతో ఏదో విషయమై గొడవ జరిగింది. చివరికి అది హింసాత్మకంగా మారింది. సదరు డ్యాన్స్ బృందం ఆగ్రహంతో వధువు ఇంటిలోనికి చొరబడి, అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. ఈ నేపధ్యంలో వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో సహా పలువురు మహిళలు గాయపడ్డారు.
అంతటితో ఊరుకోకుండా వారు వధువు ఇంటిలోని ఆభరణాలు, విలువైన వస్తువులు, ఖరీదైన దుస్తులను దోచుకుని ఉడాయించారు. విషయం తెలుసుకున్న వరుడు డ్యాన్స్ బృంద సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు అతన్ని చావబాది, బలవంతంగా వ్యాన్‌లోనికి ఎక్కించుకుని, తమతో పాటు తీసుకుపోయారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు(Local police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వధువు షాక్‌లో ఉంది. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం కోసం పని చేయను: శశి థరూర్