
సాక్షి న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ ఈ మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం, ఆ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికి పోయింది.
30 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు రద్దయ్యేలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లుతో రాజకీయ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందంటూ బిల్లు ప్రతుల్ని చించివేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3గంటల వరకు వాయిదా వేశారు.
వాయిదాకి ముందు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేలా హోమంత్రి అమిత్‌షా బిల్లును ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతుల్ని చించి అమిత్‌షాపై విసిరేశారు. ఈ బిల్లు దేశ సమాఖ్య విధానానికి పూర్తి విరుద్దం అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ హోమంత్రిగా ఉన్నప్పుడు అమిత్‌షా అరెస్ట్ అయ్యారంటూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపల్ని అమిత్‌షా ఖండించారు.
‘అవును ..నన్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ అయినప్పుడు చేసినా నైతికంగా పదవికి రాజీనామా చేశాను’ అంటూ ప్రతిపక్ష ఎంపీలను అమిత్‌షా వారించారు.
