
వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో విపక్షాల డిమాండ్
అంగీకరించని ప్రభుత్వం.. ఉభయ సభలు పలుమార్లు వాయిదా
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్లమెంట్‌లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.
నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్‌సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్‌కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్‌సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే
రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్‌పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు.
పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన
ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్‌ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు.