
తగ్గించడంపై దృష్టి పెడితే మంచిది
పాక్‌కు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచన
జమ్మూ: సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాకిస్తాన్‌నే దెబ్బతీస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పాక్‌కు సూచించారు. లేదంటే వారికి ఎక్కువ నష్టమని హెచ్చరించారు. గురువారం రాత్రి పాకిస్తాన్ చేసిన దాడుల్లో ఒక్క డ్రోన్ కూడా లక్ష్యాన్ని చేరుకోకుండా వేగంగా స్పందించిన సాయుధ దళాలను ఒమర్ ప్రశంసించారు. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సహాయ శిబిరాలను, సరిహద్దు రేఖ వెంబడి పాక్ షెల్లింగ్‌లో గాయపడిన వారున్న ఆసుపత్రులను సందర్శించిన సీఎం.. విజయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘1971 యుద్ధం పాక్ చేసిన అత్యంత తీవ్రమైన దాడులివే.. జమ్మూలోని పలు ప్రాంతాలు, అనంత్‌నాగ్‌లోని మందుగుండు సామగ్రి డిపోను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం పాక్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల పాకిస్తాన్‌కు ఒరిగేదేమీ లేదు. ఆ దేశం విజయం సాధించలేదు. కాబట్టి వారు తుపాకులను పక్కన పెట్టి సాధారణ స్థితిని తీసుకురావడానికి సహకరిస్తే మంచిది. గురువారం రాత్రి తరువాత జరిగిన సంఘటనలు ఉద్రిక్తతను పెంచే ప్రయత్నాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనివల్ల వారే ఎక్కువగా బాధపడతారు’’అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
పూంచ్‌లో పరిస్థితి క్లిష్టంగా ఉంది
పాక్ షెల్లింగ్ వల్ల పూంచ్ నగరానికి భారీ నష్టం వాటిల్లిందని, పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది అక్కడి వారేనన్నారు. తాను జమ్మూలోని ఆస్పత్రిని సందర్శించానని, గాయాలతో అక్కడ అడ్మిడ్ అయిన వారంతా పూంచ్‌కు చెందిన వారేనని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని శస్త్రచికిత్స కోసం పీజీఐ చండీగఢ్‌కు తరలించామన్నారు. జమ్మూ జిల్లాలోని మిష్రివాలా, నాగ్బానీ, కోట్ భల్వాల్, సాంబాలోని విజయపూర్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఆయన నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి, వారికి ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శిబిరాల్లో అసౌకర్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆట సామగ్రి కావాలని అడిగిన పిల్లలకు.. తన సొంత వాహనంలో తెచ్చి అప్పగించిన మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు.