
సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు
57 మందికి తీవ్ర గాయాలు
దీటుగా బదులిచ్చిన భారతసైన్యం
సరిహద్దుకు ఆవల పాక్‌లోనూ భారీగా మరణాలు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్‌జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్‌లను గుర్తించారు.
పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్‌ధార్, మాన్‌కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్‌లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్‌ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్‌ర్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్‌లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు.
బోర్డర్‌కు ఆవల డజన్ల మంది మృతి
పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.