breaking news
Border villeges
-
జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్‌జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్‌లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్‌కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్‌ర్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్‌కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు
సాక్షి, ప్రతినిధి విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 34 గ్రామాలు.. 15 వేల మంది జనాభా.. విజయనగరం జిల్లా సాలూరుకు అటు, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు మధ్యలో కొటియా గ్రూపు గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. పట్టు చెన్నేరు గ్రామ పంచాయతీలో 12, పగులు చెన్నేరులో నాలుగు, గంజాయిభద్రలో 13, సారికలో రెండు, కురుకూటిలో రెండు, తోణాంలో ఒకటి చొప్పున మొత్తం 34 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936లో ఒడిశా, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వారిని ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సూచించింది. అంతవరకూ ఎవరూ ఆక్రమణలకు పాల్పడవద్దని 2006లో ఆదేశాలు ఇచ్చింది. అయితే కొటియా గ్రామస్తులంతా ఆంధ్రాకి చెందినవారేననడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతోపాటు ఆంధ్రప్రదేశ్ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. అలాగే, ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్‌కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో వాటిని తమకూ వర్తింపజేయాలని కొటియా గ్రామస్తులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కొనసాగాయి. వైఎస్సార్ హఠాన్మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొటియా గ్రామాలను పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వమైతే పూర్తిగా కొటియా ప్రజలను విస్మరించింది. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వ ప్రోత్సాహంతో కోరాపుట్‌కు చెందిన అధికారులు, రాజకీయ నేతలు కొటియా గ్రామాలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే కొటియా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది గమనించిన ఒడిశా నేతలు ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.180 కోట్లు మంజూరయ్యాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కొటియా ప్రజల పరాబ్ పండుగకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. కొటియాలో పది పడకల ఆస్పత్రి, పోలీస్‌స్టేషన్, పాఠశాలల వంటి శాశ్వత భవనాల నిర్మాణ పనులను ఆగమేఘాలపై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులను చూపిస్తున్న ధూళిభద్ర గ్రామ గిరిజనులు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మా కొటియా గ్రామాలకు అందుతున్నాయి. పూర్వం నుంచి మేము తెలుగు వాళ్లమే. మా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంచాలి. – కూనేటి కుసి, సర్పంచ్, పగులుచెన్నేరు, సాలూరు మండలం మేము ఆంధ్రా వాళ్లమే.. మా భూముల శిస్తు, తదితర లావాదేవీలకు సంబంధించి రాగిరేకులపై రాసిన తామ్ర పత్రాలు ఉన్నాయి. అవన్నీ సాలూరు తాలూకా అని తెలుగులో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మేము ఆంధ్రా వాళ్లమే. ఒడిశా మా గ్రామాలను కలుపుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తోంది. ఇప్పటికైనా మా గ్రామాల రక్షణ బాధ్యత తీసుకోవాలి. – గమ్మెల బీసు, ఉప సర్పంచ్, గంజాయిభద్ర, సాలూరు మండలం అభివృద్ధికి అటవీ శాఖ అడ్డంకులు కొటియా గ్రామాల ప్రజలు రోడ్లు వేయాలని కోరుతున్నారు. రోడ్ల నిర్మాణానికి విజయనగరం జిల్లా అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. మరోవైపు ఒడిశా ఆగమేఘాలపై రోడ్లు నిర్మిస్తోంది. యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా బేఖాతరు చేస్తోంది. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు, విజయనగరం జిల్లా కొటియాలో సంక్షేమ పథకాల అమలు కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తున్నాం. వారంతా ఆంధ్రాలో కలిసి ఉంటామని అడుగుతున్నారు. కొటియా గ్రామాల్లో అంగన్వాడీ, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం కొటియా గ్రామాల్లో వాటికి శంకుస్థాపనలు చేయనున్నాం. – ఆర్.కూర్మనాథ్, పీవో, ఐటీడీఏ, పార్వతీపురం -
సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు
విజయనగరం రూరల్ : రాష్ట్ర, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డీసీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. కొమరాడ మండలం గొనకల్లు, గుర్లిమ్మ గ్రామాల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పార్వతీపురం, సాలూరు, తెర్లాం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 50 లీటర్ల నాటుసారా, 500 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఐదు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీ టి.నాగలక్ష్మి కొమరాడ చెక్‌పోస్టులో రికార్డులు తనిఖీ చేశారు. సరిహద్దు రహదారిపై వాహనాలను పరిశీలించారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి ఏసీ ఎ.శంభూప్రసాద్, ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి, 50 మంది సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.