ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు | Old Woman In ICU After Denied Wheelchair Air India reply This | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు.. మనవరాలి పోస్ట్‌ వైరల్‌

Published Sat, Mar 8 2025 8:42 AM | Last Updated on Sat, Mar 8 2025 8:49 AM

Old Woman In ICU After Denied Wheelchair Air India reply This

ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ఆమె ఎండగట్టడంతో.. దెబ్బకు ఎయిరిండియా దిగొచ్చింది. 

రాజ్‌ పశ్రీచా(82) మాజీ సైనికాధికారి భార్య. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్‌ కోసం బుక్‌ చేసుకోగా.. అది కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లారు. కాలు జారి కిందపడి గాయపడ్డారు.

ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్‌ కిట్‌ కొనుక్కొచ్చి ఫస్ట్‌ ఎయిడ్‌ చేశామని మనవరాలు పరుల్‌ కన్వర్‌(Parul Kanwar) తెలిపారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్‌ వచ్చిందని.. గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు.  అయితే.. 

ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్‌ తెలిపారు. 

ఈ ఘటనను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె.. మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్‌ చేశారు.  ఈ ఘటనపై డైరెక్టోరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA), ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని  తెలిపారామె.

అయితే పరుల్‌ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్‌ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.  పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్‌ నెంబర్‌, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని తేల్చారామె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement