
అది 2023, జూలై 6.. 70 ఏళ్ల వృద్ధుడు దట్టమైన అడవిలో దారి తప్పాడు. అతనితోపాటు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి 48 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మనదేశంలోని గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు..
గుజరాత్‌లోని గిర్నార్ అడవుల ఎంతో దట్టంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా దారి తప్పారంటే ఇక అంతే సంగతులు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా పూప్ తాలూకాలోని కుప్రాలా గ్రామానికి చెందిన మదన్మోహన్ మురళీధర్ జైన్(72) ఈ ఏడాది జూలై 6వ తేదీన 20 మంది సభ్యుల బృందంతో పాటు జునాగఢ్‌లోని గిర్నార్‌కు విహారయాత్రకు వచ్చాడు. వారంతా గిర్నార్‌లోని అంబాజీ ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం వారంతా అక్కడి జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే మురళీధర్.. బృంద సభ్యుల నుంచి వినిపోయాడు. ఆ సమయంలో అతనికి దాహం వేయడంతో నీటి కోసం వెదుకుతూ వెళ్లాడు. ఒకచోట ఊట నీరు తాగుతుండగా అతని కాలు జారింది. ఆ నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. కాస్త తేరుకుని లేచి నిలబడే సమయానికి అడవి మధ్యలోకి వచ్చేశాడు.
నీటిలో కొట్టుకుపోయిన సందర్భంలో అతని పాదాలకు, తలకు ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో మురళీధర్ తనను కాపాడమంటూ ఎనిమిది గంటల పాటు కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతని ఆరుపులు అరణ్యరోదనగా మారాయి. కొద్దిసేపటికి మురళీధర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి అడవి పందుల గుంపు అతనికి అతి సమీపం నుంచి వెళుతోంది. వాటిని చూసినంతనే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అయితే అవి అతనిని ఏమీ చేయకుండా విడిచిపెట్టడం విశేషం.
మరోవైపు మురళీధర్ బృంద సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 33 మంది సభ్యులు గల ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, అటవీ శాఖ హోంగార్డుల బృందం అడవిలో గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వారు మురళీధర్‌ను గుర్తించి కాపాడారు.
ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే..