టీవీలకు కనెక్ట్‌ అవుతున్నారు! | Number of connected TVs reaches 3 crore | Sakshi
Sakshi News home page

టీవీలకు కనెక్ట్‌ అవుతున్నారు!

Jun 20 2025 2:49 AM | Updated on Jun 20 2025 2:49 AM

Number of connected TVs reaches 3 crore

3 కోట్లకు చేరిన కనెక్టెడ్‌ టీవీల సంఖ్య

ఏడాదిలో 30 శాతం పెరిగిన వైనం

కొత్తగా తోడైన 3.5 కోట్ల వీక్షకులు

పూర్తి డిజిటల్‌ టీవీ వీక్షకులు 23%

డిజిటల్‌ కంటెంట్‌కు మళ్లుతున్న జనం

‘ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ వచ్చాయో?’.. ‘ఆ హీరో, హీరోయిన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’.. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే మాటలు. ఇంటర్నెట్‌తో పనిచేసే కనెక్టెడ్‌ టీవీ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని నచ్చిన సినిమాను, సిరీస్‌ను తమకు అనుకూలమైన సమయంలో ఆస్వాదిస్తున్నారు. ఈ కనెక్టెడ్‌ టీవీలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. 2025 జనవరి–మార్చిలో కొత్తగా 3.5 కోట్ల కనెక్టెడ్‌ టీవీ వ్యూయర్లు పెరిగారని కాంటార్‌ మీడియా కంపాస్‌ నివేదిక వెల్లడించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఇప్పుడు కంటెంట్‌ కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారట.

ఇంటర్నెట్‌ విస్తృతి మనదేశంలో కేవలం స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగేందుకే పరిమితం కాలేదు. కనెక్టెడ్‌ టీవీల జోరుకూ దోహద పడుతోంది. దాంతో సంప్రదాయ టీవీ వీక్షణ నుంచి డిజిటల్‌ వైపు జనం మళ్లుతున్నారు. దేశవ్యాప్తంగా మూడు నెలల్లోనే కనెక్టెడ్‌ టీవీ వీక్షకులు కొత్తగా 3.5 కోట్ల మంది తోడవడమే దీనికున్న క్రేజుకు నిదర్శనం. యువ వీక్షకులు సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం, ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) జోరు, టెలికం కంపెనీల చవక బ్రాడ్‌బ్యాండ్‌ ప్యాక్స్, స్మార్ట్‌ టీవీలు అందుబాటు ధరలో లభించడం.. వెరసి కనెక్టెడ్‌ టీవీల సంఖ్య దేశంలో దూసుకుపోతోంది. 

తీరిక సమయంలో చూసేస్తున్నారు
అమెజాన్   ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జియో హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ యాప్స్‌ ద్వారా ఆన్‌–డిమాండ్‌ కంటెంట్‌ను ఆస్వాదించేందుకు కనెక్టెడ్‌ టీవీ వీలు కల్పిస్తుంది.  ఇంటర్నెట్‌ ఆధారిత కనెక్టెడ్‌ టీవీల్లో వీక్షకులు తమకు వీలున్న సమయంలో నచ్చిన కంటెంట్‌ను వీక్షించే సౌలభ్యం ఉంటుంది. భారత్‌లో పూర్తి డిజిటల్‌ టీవీ వీక్షకులు 23 శాతం ఉన్నారు. సంప్రదాయ టీవీకి వీరు దూరం.  

కేబుల్, ఉపగ్రహం, ఓవర్‌ ద ఎయిర్‌ సిగ్నల్స్‌ ద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం ప్రసారమయ్యే కార్యక్రమాల వీక్షణకే సంప్రదాయ టీవీ పరిమితం అవుతుంది. 58% మంది భారతీయులు ఇప్పటికీ ప్రతి నెలా సంప్రదాయ టీవీ వీక్షణపై ఆధారపడుతున్నారు. పాత తరం జనాభాలో సంప్రదాయ టీవీకి ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది. 

యువతరం డిజిటల్‌కు..
మీడియా ప్రాధాన్యతలలో తరాలనుబట్టి అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. 15–34 సంవత్సరాల వయస్సు గలవారిలో.. అంటే జనరేషన్‌ జెడ్‌ (13–28 ఏళ్ల మధ్య ఉన్నవారు), యంగ్‌ మిలీనియల్స్‌ (29–34 ఏళ్ల మధ్య ఉన్నవారు) డిజిటల్, ఓటీటీని 55%, సోషల్‌ మీడియాను 57% మంది ఇష్టపడుతున్నారు.

45 ఏళ్లకుపైగా వయసున్న వారిలో 44% మంది ఇంటర్నెట్‌ ఆధారిత ఇతర కార్యక్రమాల కంటే సంప్రదాయ టీవీ వీక్షణకే మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి చూడగలిగే ఆరోగ్యకర షోలను లక్ష్యంగా చేసుకునే వీడియో స్ట్రీమింగ్‌ కంపెనీల కంటెంట్, మార్కెటింగ్‌ వ్యూహాలను పట్టణ ప్రాంతాల్లో కనెక్టెడ్‌ టీవీ సెట్ల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. 

గ్రామీణ భారతం హవా
గ్రామీణ వాసులు సంప్రదాయ టీవీనే చూస్తున్నారనుకుంటే పొరపాటే. గ్రామీణ భారతం ఒక మీడియా పవర్‌హౌస్‌గా అవతరించింది. పాత అంచనాలను బద్దలు కొడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ వీక్షకులు 74%, సంప్రదాయ వీక్షకులు 75% ఉన్నారు. కనెక్టెడ్‌ టీవీ మెట్రోలకే పరిమితం కాలేదని.. పట్టణ, గ్రామీణ ప్రేక్షకులను సమానంగా చేరుకుంటోందని కాంటార్‌ నివేదిక స్పష్టం చేసింది. 

ఇక ప్రకటనల విషయానికొస్తే విభిన్న ప్రేక్షకులను వేర్వేరు సందేశాలతో చేరుకోవడానికి కనెక్టెడ్‌ టీవీ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని వినోద పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఈ కనెక్టెడ్‌ టీవీలో సినిమాలూ, వెబ్‌ సిరీస్‌లూ చూడటం కూడా పెరిగింది. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో కనెక్టెడ్‌ టీవీ గ్రామీణ ప్రాంతాల్లోనూ వినోద కేంద్రంగా మారిందని వారు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement