తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు | Sakshi
Sakshi News home page

తీర్పులు న్యాయమూర్తుల వ్యక్తిగతం కాదు

Published Tue, Jan 2 2024 5:11 AM

Not appropriate for me to: Chief Justice Chandrachud on Article 370 verdict - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల వెలువరించిన ఏకగ్రీవ తీర్పు పట్ల వ్యక్తమవుతున్న విమర్శలపై స్పందించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ DY చంద్రచూడ్‌ నిరాకరించారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే న్యాయమూర్తులు కేసులపై తీర్పులిస్తారని చెప్పారు. ఏదైనా కేసుపై చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

సోమవారం పీటీఐ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో జస్టిస్‌ చంద్రచూడ్‌ పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచలేమంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచి్చన తీర్పుపై మాట్లాడారు. ఏ న్యాయమూర్తి కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇచ్చిన తీర్పు కూడా జడ్జిల వ్యక్తిగతం కాదని అన్నారు. చాలా రకాల కేసుల విచారణ, తీర్పుల్లో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని గుర్తుచేశారు.

ఒక జడ్జిగా ఏ కేసును, తీర్పునూ వ్యక్తిగతంగా తీసుకోలేదని చెప్పారు. అందుకు తనకు ఎలాంటి విచారం గానీ, ఫిర్యాదు గానీ లేదన్నారు. న్యాయమూర్తులు తీర్పు వెలువరించిన తర్వాత అది ప్రజల ఆస్తిగా మారుతుందని స్పష్టం చేశారు. దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రజలకుంటుందని పేర్కొన్నారు. తీర్పుపై విమర్శలను తిప్పికొట్టడం, సమరి్థంచుకోవడం సరికాదన్నారు. తీర్పు ఇచి్చన తర్వాత ఇక ఆ సంగతి పక్కన పెట్టాలన్నది తన ఉద్దేశమని వివరించారు.   

తీర్పుపై ఏ జడ్జికీ ఆధిక్యముండదు
అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు దేళ్ల క్రితం ఇచ్చిన తీర్పుపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. ఈ తీర్పు రావడానికి కారణాన్ని ధర్మాసనంలోని ఏ ఒక్క సభ్యుడికో అపాదించలేమని పేర్కొన్నారు.

ధర్మాసనంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా అయోధ్య తీర్పు ఇచ్చారని వెల్లడించారు. ఏ కేసులో అయినా ఇవ్వాల్సిన తీర్పును సంబంధిత జడ్జిలంతా కలిసి కూర్చొని, చర్చించుకొని నిర్ణయిస్తారని పేర్కొన్నారు. చివరకు అది కోర్టు తీర్పుగా మారుతుందని స్పష్టం చేశారు. తీర్పును నిర్ణయించే విషయంలో ఆధిక్యం ఏ ఒక్క జడ్జికో కట్టబెట్టలేమని తేలి్చచెప్పారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించే కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదు అని విమర్శించడం సరైంది కాదని జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొలీజియంలో అంతర్గతంగా జరిగే సంప్రదింపులను కొన్న కారణాలతో ప్రజలకు తెలియపర్చలేమని సీజేఐ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement